విస్తారంగా పరుచుకున్న
ఇసుక రేణువుల మధ్య
ఒక్కొక్క అడుగువేస్తూ ప్రయాణిస్తున్నాను....
కాస్తంత నీటి తడైనా దొరుకుతుందేమోనని
నా కలల కన్నీళ్లన్నీ జారి పడింది అక్కడే
ప్రయాణమంతా లూనీ నదిలా ...
పరుగులు తీస్తుంది
ఏ సముద్రంలోనూ కలవడం లేదు
అంతుచిక్కని రహస్యంలా....
ఎడారిలోని ఇసుకకుప్పల్లో ఇంకిపోతుంది
ఖర్జూర పండ్లలాంటి తీపి ఒకటి తగులుతున్నా
ఏదో తెలియని చేదొకటి వెంటాడుతోంది
గుండెల్లో మండే బాధలా....
వెచ్చని గాలి వీస్తూ.. ఎదను తాకుతోంది..
ఇసుక రాళ్ల తాకిళ్ల శబ్దాలన్నీ
సంగీతంలా మారి....
బతుకు పాటను వినిపిస్తున్నాయి
అయినా సాగుతుంది ప్రయాణం
ఎడారి దారిన
బ్రహ్మజెముడు చెట్లే నాకు ఆదర్శం
ఒల్లును ముళ్లుగా మలుచుకొని...
ఆశల నీటిని ఆవిరవ్వకుండా ....
నిప్పుల కుంపటిలాంటి ఎండలో
ఎదుగుతున్నాయి
స్వేదపు చుక్కలు...కన్నీటిబొట్లతో
దాహాన్ని తీర్చుకుంటూ...
ఒంటెలతో సమానంగా పరుగెడుతున్న
ఇసుక దిబ్బలన్నీ ... నన్ను ముందుకు నెట్టి
నాకంటే వేగంగా వెనక్కి వెళ్తున్నాయి
పట్టుదల ముందు అవి తేలిపోయి
అక్కడేదో ఒయాసిస్సు నాకోసం చూస్తుంది
తన హృదయాన్ని తెరుచుకొని
అక్కడేదో నేను పోగొట్టుకున్న
నా కలల కన్నీళ్లన్నీ కనిపిస్తున్నాయి
అవి పచ్చని మొక్కలై దర్శనమిస్తున్నాయి
ఎడారి జీవులకు గొంతును తడుపుతున్నాయి
చివరకు నా దాహాన్ని కూడా తీరుస్తూ...
అశోక్ గోనె
94413 17361