ప్రజాశక్తి - ఏలూరు
ఏడాదికి రెండుసార్లు పిల్లల చేత అల్బెండజోల్ మాత్రలు మింగించడం ద్వారా వారిలో రక్తహీనత, పోషకాహారలోపాన్ని తొలగించవచ్చని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురువారం ఏలూరులోని సురేష్‌చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గంట పద్మజ ప్రసాద్, జిల్లా ఎస్‌పి మేరీప్రశాంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆశ, డిఇఒ శ్యామ్‌సుందర్, ఎన్‌సిడి ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ మానసతో కలిసి విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నాలుగు లక్షల 536 మందికి నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ జరుగుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల్లో పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. పిల్లల్లో అత్యధిక శాతం రక్తహీనత లోపం వల్లే ఎక్కువ అనారోగ్యాలకు గురవుతున్నారని, ప్రతీ ఆరు మాసాలకు ఒకసారి నులిపురుగు మాత్రలు తీసుకోవడం ద్వారా రక్తహీనత లోపాన్ని అధిగమించడంతో పాటు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పిల్లల శరీరంలో నులిపురుగులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఆక్సిజన్, హిమోగ్లోబిన్ శాతం తగ్గి, తరచుగా అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏడాది నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు తీసుకునే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పి ఎంజెవి భాస్కర్ రావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు వి.స్రవంతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










