May 05,2022 06:28

యువతరం శిరమెత్తితే... నవతరం గళమెత్తితే...ఈలోకమే మారుతుంది. చీకటే మాసిపోతుందని మహాకవి ప్రబోధించాడు. దేశ సంపదలో యువత భూమిక శిఖర స్థాయిలో ఉంది. ఉన్నత చదువులు చదివినప్పటికీ యువతకు ఉద్యోగ, ఉపాధి లేదు. కేంద్రంలో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన బాసలు ఏమయ్యాయన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ సర్కారు 8 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే 60 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మరో 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన ప్రకటన యువతకు ఆశ్చర్యం కల్గించింది. మోడీ సర్కారు గద్దెనెక్కిన తర్వాత 8.1 శాతం నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. 18 సంవత్సరాల నుంచి 25 ఏళ్ల యువత 50 శాతం ఉన్నారు. కోవిడ్‌ తర్వాత నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. ఉద్యోగాలు ఇవ్వరు. ఉపాధి చూపించరేమని యువత ప్రశ్నిస్తున్నారు.
కేంద్రంలోని 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో 19.15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీకి మాత్రం శ్రీకారం చుట్టలేదు. 72 కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 8 లక్షల 72 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రక్షణ రంగంలో 2.27 లక్షలు పోస్టల్‌ శాఖల్లో 90 వేలు, హోం శాఖల్లో 1 లక్షా 28 వేలు, రెవిన్యూ శాఖల్లో 76,327, సైన్సు అండ్‌ టెక్నాలజి శాఖలో 8,227, గనుల శాఖల్లో 6,925, జలవనరుల శాఖల్లో 4,557, కుటుంబ ఆరోగ్య శాఖల్లో 21,003, ఐ.ఎ.ఎస్‌ పోస్టులు 1,672, ఐ.పి.ఎస్‌ పోస్టులు 1,452, సివిల్‌ సర్వీసెస్‌ పోస్టులు మరో 3 వేలు ఖాళీగా ఉన్నాయి. సాయుధ బలగాల్లో 1,22,555, గ్రామీణ డాక్‌ సేవల్లో 73,452, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177, ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లలో 1,86,000 వేలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 10368, ఐఐటిల్లో 3,876, జె.ఎన్‌.టి.యుల్లో 3,978...దిగువ కోర్సుల్లో 5,133, హైకోర్టు జడ్జి పోస్టులు 404, ఆరోగ్య శాఖల్లో 60 వేలు, విశ్వవిద్యాలయాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 6,535 ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోవడంలేదు.
నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నప్పటికి ప్రభుత్వం ఇస్తామన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగల్‌ ఇవ్వదేమిటన్న ఆందోళనలో యువత వున్నారు. నేతలు ఎన్నికలు వచ్చినప్పుడల్లా యువతకు గాలమేసి ఓట్లు పొంది, అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటున్నారు. అంతే తప్ప ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత యువతకు ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు చేశామనేది కనీసం సమీక్ష చేసుకునే పరిస్థితి లేకపోవడం నిజంగా శోచనీయం. ఉపాధి, ఉద్యోగం కోసం యువత పిడికిలి బిగించి పోరాటం సాగించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- గుర్రం రాంమోహన్‌ రెడ్డి,
సెల్‌ : 7981018644