ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే
ప్రజాశక్తి - రంపచోడవరం
ఈ సంవత్సరం చివరి నాటికి అన్ని గ్రామాలకు సెల్ సేవలు అందుబాటులో ఉండేవిధంగా సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే తెలిపారు. శనివారం రంపచోడవరం మండలం చిలకమాడి గ్రామంలో బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఏర్పాటుకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంపచోడవరం ఏజెన్సీలోని అన్ని గ్రామాల ప్రజలకు టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేయుటకు 375 సెల్ టవర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు చెప్పారు. 375 సెల్ టవర్లు ఏర్పాటుకు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు కూడా కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు, డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజశేఖర్ బాబు, ఏజీఎం సత్య రఘురాం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.










