May 22,2022 11:36

యథాలాపంగా నడుస్తున్నా..నడుస్తున్నా
కొన్ని నిట్టూర్పుల్ని కొన్ని నిస్పహల్ని
కొంత క్లేశాన్ని కొంత ద్వేషాన్ని
నాలో ఇంకా తెగిపోని
విభిన్న ధవాల ప్రేమ దారాల్ని
మూట గట్టుకొని నడుస్తున్నా నడుస్తున్నా..

ఎక్కడ వదలాలో తెల్వటంలేదు
ఎక్కడ గిరాటు కొట్టాలో తోచటంలేదు

మూట ముడివిప్పి ఎవరైనా చూస్తారేమో..!
ఇంతకాలం దాచుకున్న రహస్యం
కడుపుచించుకుని
కాళ్ల మీద పడుతుందేమో..!
లోలోపల వెంపర్లాట
ప్రసవ వేదనకు మించిన వేదన

పచ్చగా చక్కగా గీసుకున్న
మూర్తిమత్వ ముఖచిత్రం
పీఠభూమిలా భీటలు వారుతుందేమో..!
నా భయమే నన్ను వెంటాడింది..వేటాడింది
ఏ కరాలకు ఏ శరాలకూ చిక్కలే

మూటను ఎక్కడా పడేయ బుద్ధికాలే
మళ్లీ భుజానికే ఎత్తుకున్నా
మళ్లీ యథావిధిగానే నడుస్తున్నా..

విస్తుపోయే విషయమేమిటంటే..!?
నా ముందు చాలామందే
ఇలా నడుస్తున్నారు
నా వెనుక సుత ఇలానే వస్తున్నారు
మూటల్ని భద్రంగా భుజానికెత్తుకుని..!
 

డా.కటుకోఝ్వల రమేష్‌
99490 83327