Nov 08,2023 12:00

కోల్‌కతా :   తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి అభిషేక్‌ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) బుధవారం సమన్లు జారీచేసింది. ఉపాధ్యాయుల నియామక కుంభకోణానికి సంబంధించి గురువారం ( నవంబర్‌ 9) విచారణకు హాజరుకావాలని పేర్కొన్నట్లు టిఎంసి నేత ఒకరు తెలిపారు. అభిషేక్‌ బెనర్జీ రాజకీయ ప్రతీకార దాడులకు బాధితుడని పశ్చిమబెంగాల్‌ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు టిఎంసి అధికార ప్రతినిధి శశి పంజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో ప్రతిపక్ష నేతలను వేధించేందుకు బిజెపి ఇటువంటి ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ, న్యూఢిల్లీలో జరిగిన టిఎంసి నిరసన ర్యాలీలో పాల్గనేందుకు అక్టోబర్‌ 3న సమన్లను దాటవేశారు. దీంతో అక్టోబర్‌ 9న విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్‌ 13 జరిగిన ఉపాధ్యయ నియామక కుంభకోణం కేసులో సుమారు తొమ్మిది గంటల పాటు ఈడి అభిషేక్‌ బెనర్జీని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే తనను ప్రతిపక్ష కూటమి 'ఇండియా' సమావేశంలో పాల్గొనకుండా  అడ్డుకునేందుకు యత్నించారని ఆ సమయంలో బెనర్జీ వాదించారు. బొగ్గుదోపిడీ కేసులోనూ ఈడి రెండు సార్లు అభిషేక్‌ బెనర్జీని ప్రశ్నించింది. 2021లో ఢిల్లీలోని ఏజన్సీ కార్యాలయంలో మరియు 2022లో కోల్‌కతాలో మరోసారి ప్రశ్నించింది.