
ప్రజాశక్తి - భీమవరం రూరల్
పెద్దలు, పిల్లల గుండె సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య శిబిరాన్ని మెంటేవారితోటలోని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వైద్య సహాయ కేంద్రం (సుందరయ్య భవనం)లో మంగళవారం నిర్వహించారు. పెద్దలకు కార్డియో సర్జన్, స్థానిక తేజ హాస్పిటల్ అధినేత డాక్టర్ పొనమండ చంద్రశేఖర వర్మ ఇసిజి, ఎకో పరీక్షలు చేసి వైద్య సేవలందించారు. విజయవాడ ఆంధ్రా హాస్పిటల్‌కు చెందిన పిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ కె.విక్రమ్ 15 సంవత్సరాల్లోపు పిల్లలను పరీక్షించి వైద్య సేవలందించారు. వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఎబిఎస్‌వికె వైద్య సహాయ కేంద్రానికి సహాకారం అందిస్తున్న వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకటరామరాజు, కార్యదర్శి మంతెన కృష్ణంరాజు, ఎస్‌ఎల్‌జి హాస్పిటల్స్ (హైదరాబాద్) అధినేత దండు శివరామరాజు, అల్లూరి ట్రస్టీ బి.బలరాం, డాక్టర్ విక్రమ్, చంద్రశేఖర్ వర్మలను అభినందించారు. కార్యక్రమంలో వసుధ కోఆర్డినేటర్ ఎంవి.రామరాజు, అల్లూరి సీతారామరాజు, ఎస్‌ఎల్‌జి హాస్పిటల్స్ ప్రతినిధి వై.రణదివే పాల్గొన్నారు.