ప్రజాశక్తి - నగరం
మండలంలోని ధూళిపూడి గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి చేశారని చెప్పటం బాధాకరమని ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను రాజకీయ దురుద్దేశంతో తనపై, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావుపై అసత్య ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. గ్రామాల్లో పర్యటించేటప్పుడు ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వీలైనంత త్వరలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. దూళిపూడి గ్రామంలో తూర్పు బందేలవారిపాలెంలో వర్షం నీటిని తొలగించాలని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువస్తే అప్పుడే గ్రామంలో సైడ్ కాలువలు తవ్వించి సమస్యను పరిష్కరించామన్నారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో ధూళిపూడి ఎస్సీ కాలనీలో తిరుగుతున్న సమయంలో ఆంధ్రజ్యోతి విలేఖరి ఎస్సీ సామాజిక వర్గం పట్ల దురుసుగా, ప్రవర్తించి, దుర్భాషలాడటంతో అక్కడ గొడవ జరిగి తమ దృష్టికి వచ్చింది అన్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన సంఘటనలను కులాలు, పార్టీల మధ్య చిచ్చుపెట్టే విధంగా తప్పుడు కథనాలు సృష్టించి తనపై, మోపిదేవి వెంకటరమణరావుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటివరకు మీడియా సోదరుల పట్ల విధేయత కనబరుస్తున్నామని అన్నారు. తమ రాజకీయ జీవితంలో ఏనాడు విలేకరులని దూషించడం కానీ, దాడి చేయడం కానీ జరగలేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు చేయడం టిడిపి వక్రబుద్ధికి నిదర్శనం అన్నారు. ఈ సంఘటనపై గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, పోలీసులు విచారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. సమావేశంలో సర్పంచ్ కె హేమామృతం, ఆనంద్, ఆరూంబాక బాబురావు, మద్ది రాఘవేంద్ర, నన్నేబొమ్మలు, దాసు, ఇంకొల్లు ప్రసాదు పాల్గొన్నారు.










