Nov 10,2023 23:37

ఏఆర్‌ఎస్‌లో ప్రకృతి వ్యవసాయంపై ముగిసిన శిక్షణ

ఏఆర్‌ఎస్‌లో ప్రకృతి వ్యవసాయంపై ముగిసిన శిక్షణ
ప్రజాశక్తి - క్యాంపస్‌
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి నందు నవంబర్‌ ఒకటవ తేదీన ప్రారంభమైన ప్రకృతి సేద్యంపై జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. సహ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ సి.రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ బోర్డు సభ్యులు ప్రొఫెసర్‌ గురుమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమ డైరెక్టర్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ నాగ మాధురి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుండి 50 అప్లికేషన్లు రాగా అందులోనుండి అర్హతల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన 35 మందిని పది రోజుల శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేశామన్నారు. సేంద్రీయ, ప్రకతి వ్యవసాయంపై జాతీయ సలహాదారులు డాక్టర్‌ ఏకే యాదవ్‌, సేంద్రియ వ్యవసాయంపై నేషనల్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ ఎన్‌ రవిశంకర్‌, ఇక్రిశాట్‌ కి చెందిన డాక్టర్‌ గజానన్‌, రైతు సాధికారక సంస్థ వైస్‌ చైర్మన్‌ టి. విజరు కుమార్‌, తెలంగాణకు చెందిన పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి, ఐసిఏఆర్‌ అవార్డు పొందిన రైతు వై.జగదీశ్వరరెడ్డి, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు చెందిన మొత్తం 34 మంది నిష్ణాతులచే కార్యక్రమంలో పాల్గొన్న వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ఇందులో 10 ఉపన్యాసాలు ఆన్‌ లైన్‌ ద్వారా జరగగా మిగిలిన 24 ఉపన్యాసాలు ఆఫ్‌ లైన్లో జరిగాయని తెలిపారు. ఈ పది రోజులపాటు కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రకృతి వ్యవసాయం పుట్టుక, చరిత్రతో మొదలుపెట్టి, సాగు పద్ధతులు, సర్టిఫికేషన్‌ లో విధి విధానాలు, మార్కెటింగ్‌ వ్యూహాలు తదితర అంశాలను వివరించడం జరిగిందని తెలిపారు. శిక్షణ కార్యక్రమం మరొక డైరెక్టర్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ జి.కష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ పది రోజులు శిక్షణ అనంతరము కార్యక్రమంలో పాల్గొన్న వారికి 60 నుంచి 80 శాతం వరకు పరిజ్ఞాన అభివద్ధి జరిగిందని తెలిపారు.