Nov 04,2023 21:26

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లాలో వైసిపి సామాజిక సాధికార యాత్ర చేపట్టింది. జగనన్న మళ్లీ ఎందుకు రావాలంటూ మరో యాత్ర. అటు టిడిపి నాయకులు 'నువ్వే భవిష్యత్తు, న్యాయం గెలవాలి' అంటూ యాత్రల పరంపర సాగింది. ఇంకా మన జిల్లా వరకు సాగకపోయినా జనసేన అధినేత వారాహియాత్ర పొరుగు జిల్లాల వరకు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో సిపిఎం కూడా గడిచిన వారంలో నాలుగు రోజులపాటు విజయనగరం ఉమ్మడి జిల్లాలో ప్రజారక్షణ భేరి పేరిట బస్సు యాత్ర చేపట్టింది. ముఖ్యంగా సామాజిక సాధికార యాత్ర పేరిట వైసిపి చేపట్టిన బస్సుయాత్రలో జనాల్ని తరలింపునకు అధికార బలాన్ని ప్రయోగించారు. అక్కడక్కడా బెదిరింపులు, బుజ్జగింపులు కూడా చోటుచేసుకున్నాయి. డబ్బు, మద్యం పంపకాలు కూడా కనిపించాయి. ఇటు టిడిపి చేపట్టిన యాత్రల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. కానీ, సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరికి జనాలు తండోపతండాలుగా వచ్చేయకున్నా, వచ్చిన వారంతా స్వచ్ఛందంగా, అకుంఠిత దీక్షతో, అంత:కరణ శుద్ధితో వచ్చారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో గత నెల 30న ప్రారంభమైన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర కురుపాం, పార్వతీపురం, సీతానగరం మండలం చినబోగిలి, మక్కువ, సాలూరు, మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ మండలం బుడతనాపల్లి, తామరాపల్లి మీదుగా శృంగవరపుకోట మండలంలోని బొడ్డవర జంక్షన్‌ వరకు సాగింది. అక్కడి నుంచి అనంతగిరి మీదుగా ఈ నెల ఒకటో తేదిన అల్లూరి జిల్లాలోకి ప్రవేశించింది. శ్రీకాకుళం జిల్లా మందసలో ఈ నెల 2న ప్రారంభమైన మరో రక్షణ భేరి యాత్ర 3వ తేదీ ఉదయం 8:30 గంటలకే విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడి నుంచి విజయనగరం, భీమసింగి, జామి, ఎస్‌.కోట మీదుగా కొత్తవలస వరకు సాగింది. సుదీర్ఘమైన ఈ రక్షణ భేరి యాత్ర విజయవంతానికి జనాన్ని కూడగట్టడానికి వైసిపి, టిడిపి మాదిరిగా బస్సులు, ట్రక్కులు వంటి వాహనాలను సమకూర్చలేదు. బిర్యానీ, మందు వంటివి అసలే పంచలేదు. అయినా సరే ఎంతచెట్టుకు అంతగాలి అన్నట్టుగా జనాలు వచ్చారు. అదీ స్వచ్ఛందంగా, సొంత ప్రయాణ ఖర్చులతో రావడం విశేషం. ఇంకా చెప్పాలంటే సీతంపేట, కురుపాం, మక్కువలో సాగిన యాత్రలో భాగస్వామ్యమయ్యేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన గిరిశిఖర గ్రామాల గిరిజనులంతా తెల్లారక ముందే నిద్రలేచి.. కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ వచ్చారు. చంకల్లో చంటిబిడ్డలు, చేతిలో సంచులు పట్టుకుని మహిళలు సైతం రావడం గమనార్హం. అధికార, ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన యాత్రలో దాదాపు ఒకరినొకరు, దుమ్మెత్తుపోసుకుంటూ తీవ్ర పరుష పదజాలాలతో విమర్శలు చేసుకోవడం, లేదా గొప్పపార్టీలని తమకు తామే కితాబిచ్చుకోవడం వంటివి కనిపించాయి. ఒకరిపై ఒకరి నిందలు, ఆరోపణలు, బూతుపురాణాలతో కాలం గడిపారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య విలువలు, నిరుద్యోగం, మూతపడ్డ పరిశ్రమల గురించి ఆ పార్టీలకు చెందిన నాయకులూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో పాలకపార్టీల యాత్రలకు, సిపిఎం చేపట్టిన యాత్రకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. తేడా మాత్రమే కాదు. ఆయా పార్టీలు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాయన్న క్లారిటీ కూడా కొంతమంది వద్ద వ్యక్తమౌతోంది. సిపిఎం నాయకులు ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయ రాజకీయ వైఖరితో ముందుకొచ్చారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం, కేటాయింపులు గణాంకాలతో బట్టబయలు చేశారు. మూతపడ్డ ఫెర్రో ఎల్లాయీస్‌ను, జ్యూట్‌ మిల్లులను, చక్కెర కర్మాగారాలను తెరిపించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చకపోవడం, దాని వల్ల మన రాష్ట్రం వెనుకబడిన తీరుతెన్నులు, తీరని అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. అలా ద్రోహం చేసిన బిజెపితో వైసిపి, టిడిపి ఎలా కుమ్మక్కు అవుతున్నాయో వివరించారు. ప్రజలపై భారాలు మోపే విద్యుత్‌ సంస్కరణలు, ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం వంటి ప్రజారక్షణకు దోహపడే చట్టాలకు తూట్లుపొడిచే అంశాలపై పార్లమెంట్‌లో వైసిపి, టిడిపి సభ్యులు చేతులెత్తి మరీ బిజెపికి మద్దతు పలికిన తీరును, రాష్ట్రంలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా ఉండే వ్యవహార శైలిని కూడా ఎండగట్టారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి సిపిఎం నాయకులకు మంచి ఆదరణ లభించింది. యాత్రలో ఆగిన ప్రతిచోటా హారతి పడుతూ, తిలకం దిద్దుతూ స్వాగతం పలికారు. డప్పుల దరువులు, గిరిజన సంప్రదాయ నృత్యాలు, కోలాటాలతో తమ నాయకుల రాకను జనానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ యాత్ర వచ్చే ఎన్నికల్లో రాజకీయాలను ఏమేరకు ప్రభావితం చేస్తుందన్నది కాస్త పక్కనబెడితే, తద్వారా ఎంతో కొంతమంది అభ్యదయ, వామపక్ష, ప్రజాతంత్ర వాదులు, సిపిఎం అభిమానులు, కార్యకర్తలు రాజకీయంగా మరింత చైతన్యవంతులై సమాజాభివృద్ధి భాగస్వామ్యం అవుతారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.