’'హిట్టింగ్ బిలో ది బెల్ట్' అని ఇంగ్లీషులో ఒక పద ప్రయోగం వుంది. బాక్సింగ్ చేసేవారు నడుము దిగువ భాగం నుంచి తొడల వరకు కొట్టకూడదు. ఇదే అంశం మనకు మహాభారతంలోనూ కనిపిస్తుంది. భీముడు దుర్యోధనుని తొడలపై గదతో మోధుతాడు. దాంతో కింద కూలిపోయిన దుర్యోధనుడు... 'గదాయుద్ధంలో నాభికి దిగువన కొట్టడం అధర్మం కదా... నువ్వు గొప్ప యుగపురుషుడివి, రాజనీతిజ్ఞుడివి. నీతి తప్పనివాడవు కదా! ఎందుకిలా చేయించావని' శ్రీకృష్ణుడిని అడుగుతాడు దుర్యోధనుడు. 'నీతి తప్పడం తప్పకపోవడం అనేది ఎదుటివారిని బట్టి వుంటుంది. సోదరి సమానురాలైన వ్యక్తిని తొడలపై కూర్చోమన్నావు. కాబట్టే భీముడు ఆ తొడలను విరగ్గొడతానన్నాడు. ఇక్కడ నీతేమిటి అవినీతేమిటి' అంటాడు శ్రీకృష్ణుడు. 'ఎవడు బలవంతుడైతే వాడిదే రాజ్యం' అన్నచోట వేరే నీతి నియమాలకు విలువలేదు. మహాభారతంలో గెలిచింది కూడా బలమే. ఇక్కడ ఎవరి ధర్మం వారిది. జూదంలో ఓటమిపాలయ్యాక... రాజ్యం ఇమ్మని మళ్లీ ఎలాఅడుగుతావు అంటాడు దుర్యోధనుడు. అది అతడి నీతి. 'ఆలిని జూదంలో ఎలా ఒడ్డుతారు?' అన్నది మన ప్రశ్న. బలం వుంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అనుకోవడం ఫ్యూడల్ సంస్కృతి. మహిళ జూదానికి పనికొచ్చే ఒక వస్తువు అనుకోవడం కూడా అందులో భాగమే. సత్యానికే మారుపేరని చెప్పే హరిశ్చంద్రుడు సైతం భార్యాబిడ్డలను అమ్మేశాడు. అలా అమ్మే హక్కు, వారిని బానిసగా మార్చే హక్కు అతనికెలా వుంటుంది అంటే... నా భార్య కాబట్టి నాయిష్టం అంటాడు. భర్త మాట చెల్లించడం భార్య బాధ్యత అంటారు. ఆ తరహా భావనలన్నీ ఉదాత్తమమైనట్టు ప్రచారం చేసే భాష్యకారులు నేటికీ మనకు కనిపిస్తూనే వుంటారు.
మనకు నచ్చని వ్యక్తిని తిట్టే బూతుతిట్లలో కూడా మహిళలే లక్ష్యం కావడం ఫ్యూడల్ సంస్కృతి లక్షణమే. ఇక, పెట్టుబడిదారీ సంస్కృతిలోనైతే మహిళలను ఒక సరుకులా, కొనుక్కుని అనుభవించే వస్తువులా పరిగణిస్తారు. ఇక్కడ కూడా ఆ మహిళను పురుషుడితో సరిసమానమైన వ్యక్తిగా పరిగణించరు. ప్రస్తుతం దేశంలో ఫ్యూడల్, పెట్టుబడిదారీ విష సంస్కృతులు రెండూ కలగలసిపోయి చెలరేగుతున్నాయి. ఈ వికృత సంస్కృతి ప్రభావం సమాజం మీద బలంగా పడుతోంది. కాబట్టే అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఈ సమాజంలో రాజకీయాలతో సంబంధంలేని ఓ మహిళకు చట్టసభలోనే గౌరవం ఇవ్వలేని పరిస్థితి ఈ వికృత సంస్కృతికి అద్దం పడుతోంది. ఇలాంటి వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక సామాజిక సాంస్కృతిక విప్లవం రావాల్సిన అవసరం వుంది. చట్టసభల్లో చర్చించాల్సిన అంశాలు చాలానే వున్నాయి. అది పార్లమెంటు కావొచ్చు, అసెంబ్లీ కావొచ్చు... చట్టసభలకున్న పరిమితి ఏమిటి? ఏ విషయాన్ని ప్రస్తావించాలి, ఏ విషయాన్ని ప్రస్తావించకూడదు అనే ఇంగితం సభ్యులకు వుండాలి. ప్రతిపక్ష నేత ప్రస్తావించినా అది తప్పే అవుతుంది. దేశంలో సమస్యలే లేనట్లు మహిళలనే చర్చనీయాంశంగా ఎందుకు మార్చుతున్నారు. 'ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి? / ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి?' అని ప్రశ్నిస్తాడు తిలక్. మహిళా సాధికారత అని చట్టాలు చేస్తూ... వారి అస్తిత్వాన్నే గాయపర్చడం ఎంతవరకు సబబు? రాజకీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయనేదానికి ఈ సంఘటనలే ఉదాహరణ. ప్రజాస్వామ్య సూచీలో 2019లో 51వ స్థానంలో వున్న భారత్ 2020నాటికి 53వ స్థానానికి తగ్గిపోయిందని... ప్రజాస్వామ్యపు విలువలను పరిశీలించి ఈ ర్యాంకులు ఇచ్చామని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయు) చెబుతోంది.
ప్రజాస్వామ్యాన్ని, చట్టసభల విలువను కాపాడాలంటే ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య సంస్కృతి కావాలి. స్త్రీ పురుష తేడాలేని సమానత్వ భావాలు కావాలి. అప్పుడే మహిళను సరుకుగాకాక... మనిషిగా చూడగలుగుతాం. విలువలను, సంస్కృతిని కాపాడుకోగలుగుతాం. 'ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు?/ ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు?/ ఏ భోగవంతుని విచలింప చేయగలదు?' అన్న తిలక్ ఆవేదన సామాజిక స్పృహ, బాధ్యత ఉన్న ప్రతి సామాన్య పౌరుడి గుండెల్లోనూ నేడు కదలాడుతోంది. మొన్న అసెంబ్లీలో జరిగిన ఘటన ఒక హెచ్చరిక. ఒక పార్టీ కరెక్టు.. మరొకపార్టీ తప్పు అని కాకుండా... చట్టసభలు, రాజకీయాలు ఈ హీన సంస్కృతి బారి నుండి బయటపడి ప్రత్యామ్నాయ విలువలు పాటించడం అవసరం.










