Apr 04,2021 10:36

ఒక అసంపూర్ణ
అసమతుల్య ప్రపంచం నెలకొంది
నల్లని మేఘాలు అల్లుకున్నాయి.
ఇనుప చువ్వలు అన్యాక్రాంతమవుతున్నాయి

ఆక్షేపణ కాదు గానీ
స్వార్ధపు చేతుల్లోకి
బతుకులు తరలిపోతున్నాయి
స్వేచ్ఛకు సంకెళ్లు పడుతున్నాయి
హక్కులకి ఉరితాళ్లు బిగుసుకుంటున్నాయి
పోరాట ఫలాలు చిదిగిపోతున్నాయి
మన కలల విశాఖ ఉక్కు
రాజకీయ రంగులు అద్దుకుని
కార్పొరేట్‌ రెక్కలతో ఎగురుతోంది
మట్టిని దానం చేసినవారు
మట్టికొట్టుకు పోతున్నారు
ఇప్పుడు దేశమంతా
ప్రయివేటీకరణ పాట చిందులేస్తోంది

అస్తిత్వపు ప్రశ్నలు ఎరుపెక్కుతున్నాయి
కార్మిక రాజ్యాన్ని కాలరాసి
పెట్టుబడుల పెత్తనం పాతరాగం ఎత్తుకుంది
ఇప్పుడు గొంతులు మరింత మోగాలి
సంస్కరణలు ఏ తీరంవైపో వాలుతున్నాయి
నిరసనలు లేనిచోట
ఉనికి ప్రశ్నార్ధకమవుతుంది
కార్మిక సంక్షేమానికి
ఉద్యమాలు ఊపిరిగా
విజయకేతనం ఎగరేయాలి
-గవిడి శ్రీనివాస్‌
7019278368