May 04,2023 23:38

జార్జి పేటలో నేలకొరిగిన పంటచేలు ... (ఇన్‌సెట్‌లో) మొలకలు వస్తున్న ధాన్యం


అకాల వర్షాలకు నేలకొరిగిన పంట
మొలకలు వస్తున్న ధాన్యం
ప్రజాశక్తి- తాళ్లరేవు
అకాల వర్షాలతో పంట నష్టపోయిన ఏ రైతును కదిలించిన కన్నీటి పర్యంత మవుతు న్నారు. తాళ్ళరేవు మండలంలో సుమారు 8 వేల 611 ఎకరాల్లో వరి సాగు చేయగా మార్చి నెలాఖరు వరకు నీటి ఎద్దడి కారణంగా అరకొరగా పంటలు పండాయి.20 శాతం రైతులు కోతలు పూర్తి చేశారు. కళ్లాల్లో ధాన్యాన్ని అమ్ముకుందామనంటే ప్రభుత్వం ఆర్‌బికెల ద్వారా కొనుగోలు జరగాలని నిబంధనలు పెట్టడంతో రైతులు ధాన్యాన్ని సకాలంలో అమ్ముకోలేకపోయారు. రైతు భరోసా కేంద్రాల వద్ద గోనె సంచులు లేక, సంచులు ఉన్న చోట ధాన్యం తూకం వేసే సిబ్బంది లేక, రవాణా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో ఎక్కడి ధాన్యపు రాశులు అక్కడే ఉండిపోయాయి. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు కళ్లాల్లో ధాన్యం రాశులు తడిసి ముద్ద య్యాయి. తడిసి ముద్దయిన ధాన్యం కొనేవారు లేకపోవడంతో ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. వరిలో తేమ శాతం ఉందని ధరలు తగ్గించా రని వోపోతున్నారు. పంట ఎలా ఉన్నా కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు.

ఏ ఒక్క అధికారి రాలేదు
సుమారు 6 ఎకరాలు కోత కోసి మాసూలు చేసి వారం రోజులు కావస్తుంది. ఏ ఒక్క అధికారి రాలేదు. అకాల వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో కొద్ది మేరకు మొలకలు వచ్చేసాయి. మిగిలిన ధాన్యాన్ని ఆర బెడుతున్నాం. ఆర్‌బికె అధికారులకు ఫోన్‌ చేస్తే ధాన్యం తూకం వేసే సిబ్బంది లేరని చెబుతున్నారు.
చిట్టూరి రామకోటి నారాయణ. రైతు, పత్తి గొంది

నాకున్న రెండు కుంచాలు
అమ్మితే గాని అప్పులు తీరవు...
గత కొన్నేళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తు న్నాను. ఈ ఏడాది ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాను. ఇంతవరకు కోత కోయలేదు. అకాల వర్షాలకు పంట మునిగిపోయింది. ఒక్క పన కూడా కోయ లేదు. గత రెండేళ్లుగా రూ.2.50 లక్షలు నష్టం వచ్చింది. వ్యవసాయమే నమ్ముకుని జీవి స్తున్నాం. కనీస పెట్టు బడి కూడా రాక, చేసిన అప్పులు తీర్చడానికి నాకున్న రెండు కుంచాల పొలం అమ్మాల్సి వస్తుంది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
శీలం సుబ్బారావు. కౌలు రైతు పి. మల్లవరం

గుండమే గండంగా మారింది
నీటి ఎద్దడి సమయం లో రైతులకు ఉపయోగపడే గుండమే ఇప్పుడు గండంగా మారింది. గుండంలో నీరు దిగక పంట చేలు కుళ్లిపోతున్నాయి. పి. మల్లవరంలో ఉన్న ప్రధాన గుండంలో నీరు కింద ఉన్న మందార కాలువకు సక్రమంగా వెళ్లక పోవడం వల్ల పంట చేలు కుళ్లిపోతున్నాయి. గుండం మొత్తం గుర్రపు డెక్కతో మూసుకుపోయింది. ఉపాధి హామీ పథకం ద్వారా గుండాన్ని బాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. అప్పటివరకు పంటచేలు కుళ్లి పోవాల్సిందే.
మట్టపర్తి సుబ్బారావు. రైతు. పి.మల్లవరం పంచాయతీ
హమాలీలు, గొనెసంచుల కొరత లేదు
హమాలీలు, గోనె సంచుల కొరత లేదు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి రైతు భరోసా కేంద్రాల్లో గోని సంచులు ఉన్నాయి. హమాలీల కొరత లేదు. మండలానికి ప్రత్యేకంగా ఐదు ట్రాక్టర్లు కేటా యించారు. రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రతి గింజను కొనుగోలు చేస్తాం.
ప్రశాంతి, మండల వ్యవసాయ అధికారి