
ప్రజాశక్తి-అమరావతి : ఉపాధి హామీ చట్టం కింద ఏ గ్రామ పంచాయతీకి ఎంతిచ్చారో చెబుతూ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బిల్లుల చెల్లింపులో జాప్యానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేయడంపై మరోసారి రాష్ట్ర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు ఎందుకు పాటించడం లేదని న్యాయమూర్తి జస్టిస్ బి.దేవానంద్ నిలదీశారు. నాలుగు వారాల్లో 80 శాతం బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పేర్కొన్నారు. రూ.1,794 కోట్లకు గానూ రూ.413 కోట్లు చెల్లించినట్లు వివరించారు. ఈ వాదనను పిటిషనరు తరపున సీనియర్ న్యాయవాది విబేధిస్తూ... రూ.43 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపారు. దీంతో ఏ పంచాయతీకి ఎంతిచ్చారో తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.