ప్రజాశక్తి-ఆదోనిరూరల్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొమ్మిదేళ్ల పరిపాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకపోగా ప్రజలపై నిత్యం భారాలు వేయడమే పనిగా పెట్టుకుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి నిర్వహించారు. సంతేకుడ్లూరు, బలాదూరు, ఎడవల్లి, పెద్దహరివాణం గ్రామాల్లో ప్రచార భేరి సాగింది. ఈ సందర్భంగా వెంకటేశులు, సిపిఎం మండల కార్యదర్శి కె.లింగన్న మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు, ఎరువుల ధరలు, పురుగు మందులు ధరలు, జిఎస్‌టి పేరుతో ప్రజలపై భారాలు వేస్తోందని చెప్పారు. ఈ రకంగా ప్రజలను దోచుకోవడమే పనిగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. మరోపక్క కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు ధారాదత్తం చేస్తూ దేశాన్ని అప్పుల్లో ముంచుతోందని మండిపడ్డారు. ఈనెల 30న ఆదోనిలో పాత బస్టాండ్ ఆవరణంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం మండల నాయకులు తిక్కప్ప, లక్ష్మన్న, శాఖ కార్యదర్శి పరమేష్, సిపిఎం నాయకులు నాగరాజు, రామలింగప్ప, రామప్ప, కాలింగప్ప, అయ్యన్న, నరసప్ప, ఏలియా పాల్గొన్నారు. పెద్దకడబూరు మండలం హెచ్.మురవాణి, దొడ్డి మేకల గ్రామాల్లో ప్రచార భేరి నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి ఈడిగ తిక్కన్న గౌడ్, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, అయ్యప్ప, నాగేంద్ర, అయ్యన్న, రమేష్, శీను, వీరన్న, ఆంజనేయ, నరసప్ప, ఎంకోబు పాల్గొన్నారు.
ఆదోనిలో ప్రచార భేరి నిర్వహిస్తున్న వామపక్ష నాయకులు










