Dec 05,2021 06:52

     యనీయంగా చూస్తున్న ఓ పసిపిల్లాడిని చూపిస్తూ... 'నెలకి ఓ ఐదు వందలు సాయం చేస్తారా... మీరు పంపే ఆ డబ్బు వారి ఆకలి తీర్చుతుంది' అంటూ వచ్చే ఓ ప్రకటనను టీవీలో తరచూ చూస్తుంటాం. అది చూసిన తర్వాత సహజంగా ఎవరికైనా సాయం చేయాలనే అనిపిస్తుంది. ఆ మాత్రం సాయం చేయకపోతే... 'మనదీ ఒక బతుకేనా/ కుక్కల వలె నక్కల వలె/ మనదీ ఒక బతుకేనా/ సందులలో పందుల వలె' అని అనిపించక మానదు. అలా అనిపించడంతో ఎంతోకొంత సహాయం చేస్తాం. కానీ, ఇది కేవలం జాలి, సానుభూతితో చూడవలసిన సమస్యేనా? ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ బతికే హక్కు వుంది. అందరికీ వున్న ఆ హక్కు ఆ చిన్నారికీ వుందా? లేదా? ఆ హక్కును ఎవరు కాపాడాలి? ఆ జీవించే హక్కుకు ముప్పు ఎక్కడినుంచి వచ్చింది? అది ప్రభుత్వం బాధ్యత కదా...! 'ఒక దేశం గొప్పతనం ఆ దేశం ప్రజలకు కల్పించిన హక్కులపై ఆధారపడి వుంటుంది' అని హెచ్‌.జె.లాస్కీ అంటాడు. ప్రజల హక్కులకు పాతరేసి, తప్పుడు విధానాలను అమలు జరుపుతున్న ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా లేదు. కానీ, ఆ పిల్లవాడి ప్రాణాలు కాపాడే బాధ్యత సామాన్య ప్రజలదే అన్నట్టు చిత్రీకరిస్తుంది ఆ టీవీ యాడ్‌. 'సాంఘిక స్వేచ్ఛ నల్వురుకును ఏకరీతి లభించునందాక రాదు భావి భారత కళ్యాణ పరమ సుఖము' అని జాషువా అన్నారు. సమాన హక్కులు అందరికీ అమలు కావాలి. ఆ హక్కులను అనుభవించడానికి ఆటంకంగా వుండే విధానాలు, వ్యవస్థలు కొనసాగడమే హక్కుల ఉల్లంఘనకు మూలం.
    ఆ యాడ్‌ చూసిన తర్వాత మానవత్వంతో స్పందిస్తామే తప్ప, ఆ చిన్నారికి గల జీవించే హక్కు గురించి ఆలోచించడంలేదు. ఆ హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం... తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. సామాజిక స్పృహ పేరుతో వారి బాధ్యతను ఎదుటివారి పైకి నెట్టడానికి ప్రయత్నిస్తోంది. సామాజిక బాధ్యతను ప్రజలకు ఎవరూ గుర్తు చేయనక్కరలేదు. పేదలకు భోజనం పెట్టడమో, సాయం చేయడమో చూస్తుంటాం. కరోనా సమయంలో అది దేశమంతా కనిపించింది. అది ప్రభుత్వం చెబితే చేయలేదు. ప్రజల స్వచ్ఛంద స్పందన మాత్రమే. పేదలను ఆదుకోవడమనే లక్షణం సహజంగా మానవత్వం వున్నవారెవరైనా చేస్తారు. దానికి ప్రచారం అక్కరలేదు. కాని, పాలకుల బాధ్యతేమిటి? ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించినందున... లక్షలాది మంది పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆ పిల్లల జీవించే హక్కును కాలరాసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుంది. ఒకవైపు రాయితీల రూపంలో అంబానీ, అదానీలకు లక్షల కోట్ల రూపాయలను కట్టబెడుతున్న ప్రభుత్వం... పిల్లల ప్రాణాలను కాపాడే బాధ్యత మాత్రం ప్రజలదేనన్నట్టు, తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
    'సమానత్వం-అసమానతలను తగ్గించడం, మానవ హక్కులను అభివద్ధి చేయడం' ఈ ఏడాది థీమ్‌గా డిసెంబర్‌ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. 2030 నాటికి అసమానతలను తగ్గించాలనే ఎజెండాను సాధించే దిశగా అడుగులు వేయాలని ఐరాస భావన. కానీ ప్రపంచ వ్యాప్తంగానూ, దేశంలోనూ ఆ అడుగులకు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన అనేది రాజ్యాంగ వ్యవస్థలో రాజ్యమే చేస్తోంది. ఈ ఉల్లంఘనలకు పాల్పడేది కూడా దోపిడీ శక్తులే. ఆ శక్తుల కొమ్ముగాసే ప్రభుత్వాలుంటే మానవ హక్కులకు రక్షణ వుండదు. ఏ వర్గం చేతిలో అధికారం వుందనేదాన్ని బట్టి కూడా మానవ హక్కుల రక్షణ ఆధారపడి వుంటుంది. ఒక అదాని, ఒక వలస కార్మికుడు ఇద్దరూ మానవులే. కాని ఇద్దరి హక్కులకూ ఎంత తేడా వుందో ఆచరణలో తెలుస్తోంది. పులికి-మేకకు సమాన హక్కులిచ్చినట్లుగానే వుంటుంది. సంపదను సృష్టించే వర్గం ఒకటి... సంపదను స్వాహా చేసే వర్గం మరొకటి. అలా స్వాహా చేసే అధికారం ఉండడం సబబేనా? ఆ అధికారాన్ని కాపాడే ప్రభుత్వాలు, వ్యవస్థలు కొనసాగడం సమంజసమేనా? మానవ హక్కుల కోసం పాటు పడేవారు ముందు తేల్చుకోవాల్సిన ప్రశ్నలివి. ఆ గట్టునుంటావా? ఈ గట్టుకొస్తావా? అన్నది తేలాలి. 'నీ అధికారానికి బానిసలమై మేము గులాం అన్నంతవరకే/ ఒక్కసారి తిరగబడితే నీవు తట్టుకోలేవు/ ఆ ఆలోచనే నీకు నిదురలేని రాత్రులను బహుమతిగా ఇస్తుంది/ ఇక మేము మేల్కొంటే నీవు ఏమవుతావురా/ మట్టిలో మట్టిగా కలిసిపోవడం తప్ప' అని ఓ కవి అన్నట్లుగా మానవ హక్కుల హననానికి ఎవరు పాల్పడినా ప్రజాస్వామ్య రథచక్రాల కింద నలిగిపోక తప్పదు.