Apr 03,2023 14:56

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 35వేల ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ, 5600 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ జయచంద్ర జిల్లా అధ్యక్షులు కార్యదర్శి నరేంద్ర,సుమన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాధవ కృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం ఖాళీలన్నింటినీ కలిపి ప్రతి సంవత్సరం డీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు డీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. డిసెంబర్ 22వ తేదీ పార్లమెంటులో  కేంద్ర మంత్రి ధర్మేంద్ర డివైఎఫ్ఐ అఖిలభారత అధ్యక్షులు ఏఏ రహీం రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్లో 50667 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కానీ పిడిఎఫ్ ఎమ్మెల్సీలు శాసన మండలిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని అడుగుతే కేవలం 774 పోస్టులే ఖాళీగా ఉన్నట్లు నిరుద్యోగులను మోసం చేసే విధంగా కుట్రపూరితమైన సమాధానం చెప్పారని తెలిపారు. గతంలో జాబ్ క్యాలెండర్ లో కానిస్టేబుల్ గ్రూప్ టు ఉద్యోగాల పైన కూడా ఇలాంటి ప్రకటనలే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇలాంటి అసంబద్ధ ప్రకటనలను మానేసి వాస్తవంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలకు తక్షణమే 25వేల పోస్టులతో డీఎస్సీని ప్రకటించాలని 5600 పోస్టులతో గ్రూప్ 2 ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏప్రిల్ 20వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు నిరుద్యోగులతో కలుపుకొని అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దిగవలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు నవీన్,రుపుచంద్, సురేష్,చరణ్ ఎస్ ఎఫ్ ఐ నాయకులు రవి అక్బర్ సురేష్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.