ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం క్రీడా మైదానాలను, ఇండోర్ స్టేడియాలను, క్రీడా వికాస కేంద్రాలను ప్రైవేటు వారికి లీజుకి ఇచ్చే నిర్ణయం ఉపసంహరించుకోవాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. లీజుకు వ్యతిరేకంగా విజయవాడ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియం నందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ క్రీడ మైదానాలను, స్టేడియాలను, ఇండోర్ స్టేడియంలను, స్విమ్మింగ్ పూల్, జిమ్ సెంటర్లను, పే అండ్ ప్లే పేరుతో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రైవేట్ కాంట్రాక్టర్లకు లీజుకిచ్చే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం స్టేడియాలను పే టు ప్లే పేరుతో అడ్మిషన్ 300 నుంచి సంవత్సరం సభ్యత్వం 5000 వరకు వసూళ్లు చేసే పద్ధతుల్లో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు లీజుకు ఇచ్చి ఆదాయం రాబట్టాలని అదేవిధంగా క్రీడా మైదానాలు లక్షల్లో లీజుకిచ్చి క్రీడాకారుల నుండి డబ్బులు వసూళ్లు చేసే విధంగా అధికారులు టెండర్లు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. దీని వలన క్రీడాకారులపై సభ్యత ఫీజు, నెలనెలా ఫీజు, సామాగ్రి చార్జీల భారం, వసతి భారం పడనుందని తెలిపారు. దీనిని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ మరియు క్రీడాకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే క్రీడాకారులు & క్రీడా అభిమానులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖలు సైతం రాశారని తెలిపారు. శాప్ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే క్రీడాకారులు క్రీడా మైదానాలకు వస్తున్నారు. అసలే క్రీడల్లో మనం వెనకబడి ఉన్నామని, ఈ పే అండ్ ప్లే నిర్ణయం వల్ల ఇటు పేద క్రీడాకారులు క్రీడలకు దూరం అవుతారని, అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా దిగజారుతుంది. క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించి ఉచిత శిక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆట స్థలాలను ఇలా ప్రైవేటు వ్యక్తుల లీజుకు ఇవ్వడం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కు బడ్జెట్ నిధులు కేటాయించి క్రీడలను అభివృద్ధి చేయాలని పే టు ప్లే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.నాగేశ్వరరావు మాట్లాడుతూ "పే అండ్ ప్లే" విధానాన్ని రద్దు చేయాలని, క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని, క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు అందించాలని కోరారు. ప్రతి ఆటకు కోచ్ లను నియమించాలని గతంలో ఆంధ్రప్రదేశ్ క్రీడ ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన క్రీడా సమస్యలు ఎక్కడ పరిష్కారం కాలేదన్నారు. క్రీడారంగ సమస్యలు శాప్ అధికారులు దృష్టికి తీసుకెళ్లే క్రమంలో అధికారులు వినే పరిస్థితుల్లో లేరు ప్రభుత్వ పాలసీ అని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. క్రీడాకారులను నిర్వీర్యం చేసే "పే అండ్ ప్లే" జీవో రద్దు చేయకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పి.కృష్ణ , సెంట్రల్ సిటీ కార్యదర్శి నిజాముద్దీన్, సెంట్రల్ సిటీ అధ్యక్షులు శివ. స్పోర్ట్స్ కమిటీ నాయకులు SK పీరు. శివ. డివైఎఫ్ఐ స్థానిక నాయకులు ఎస్కే రసూల్. ఆర్ సాయి.తదితర క్రీడాకారులు పాల్గొన్నారు










