
న్యూఢిల్లీ : ఢిల్లీ - దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో వాయు నాణ్యతా ప్రమాణం రోజురోజుకీ క్షీణిస్తోంది. తాజాగా దసరా ఉత్సవాల సందర్భంగా మంగళవారం నిర్వహించిన రావణుడి దిష్టి బొమ్మల దగ్ధం, పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధంతో వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) మరింత క్షీణించి '' పూర్ కేటగిరీ'' కి చేరినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో సగటు వాయు నాణ్యతా సూచిక (ఎక్యూఐ) ఉదయం పదిగంటలకు 238 వద్ద ఉండగా, సాయంత్రం 4 గంటలకు 220కి క్షీణించినట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాలతో పాటు అనను కూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో వరుసగా మూడోరోజు ఢిల్లీలో ఎక్యూఐ మరింత క్షీణించిందని అన్నారు. రాబోయే కొద్ది రోజుల పాటు ఎక్యూఐలో పెద్దగా మెరుగుదల కనిపించే అవకాశం లేదని పర్యవేక్షణ ఏజన్సీలు తెలిపాయి.
ఘజియాబాద్‌లో ఎక్యూఐ 196, ఫరీదాబాద్‌లో 258, గురుగ్రామ్‌లో 176, నొయిడాలో 200 ఉండగా, ఢిల్లీలో రానున్న నాలుగైదు రోజులలో అత్యంత పూర్ కేటగిరీలో ఉండే అవకాశం ఉందని ఢిల్లీకి చెందిన ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ తెలిపింది. గత నెలలో ఢిల్లీలో బాణా సంచా తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధించింది. అలాగే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కాలుష్య నివారణ ప్రణాళిక స్టేజ్ 2ను అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టేజ్ 2 కింద ప్రైవేట్ వాహనాల పార్కింగ్ ఫీజులు పెంచడం, సిఎన్‌జి లేదా ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో సేవలను పెంచడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్థాన్ని వేగవంతం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ సీజన్‌లో ఒకే రోజులో అత్యధికంగా 360 పంట వ్యర్థాల దగ్థం కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,306కి చేరుకుందని అన్నారు. వరి వ్యర్థాలను తగుల బెట్టిన రైతులపై జరిమానాలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు రైతులు వరిపొట్టుకు నిప్పంటించారు. దసరా రోజుల లక్షలాది రావణుని దిష్టి బొమ్మలను దగ్థం చేసిన వారిపై , దీపావళి సందర్భంగా బాణా సంచా కాల్చిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.