
విశాఖ : విశాఖ జిల్లా సీలేరు జెన్‌కో చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఓ లారీ చెక్‌పోస్ట్ అవతలి వైపునకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చింది. దీంతో పోలీసులు అనుమానం వచ్చి ఆ లారీని ఆపారు. లారీలో సోదాలు చేయగా.. ప్యాకింగ్ చేసిన 400 కిలోల గంజాయి దొరికింది. లారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ధారకొండలో గంజాయిని కొనుగోలు చేసి తెలంగాణకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. గంజాయిని, లారీని పోలీసులు సీజ్ చేశారు. నిందితులు రాజస్తాన్‌కు చెందినవారిగా గుర్తించారు. సీజ్ చేసిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.60 నుంచి రూ.70 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ధారకొండ నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి రాజస్తాన్‌కు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. లారీలో ప్రత్యేక అరలు తయారు చేసి నిందితులు గంజాయిని తరలిస్తుండటం చూసి పోలీసులు అవాక్కయ్యారు.