ప్రజాశక్తి- యు. కొత్తపల్లి అలల తాకిడికి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం అవుతోంది. ఆ దారి గుండా ప్రయాణిస్తే ప్రమాదాలు తప్పడం లేదు. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. బీచ్ రోడ్డు ధ్వంసం అయినచోట కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో పలువురు విమర్శిస్తున్నారు. ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డు గుండా అనేకమంది వాహనదారులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు సుమారు 2000 మంది పైబడి జిల్లా కేంద్రమైన కాకినాడకు పనుల నిమిత్తం వెళుతుంటారు. రోజురోజుకూ కోతకు గురవడంతో పక్కన వేసిన మట్టి సైతం కొట్టుకు పోతోంది. దీంతో ఆ రోడ్డుగుండా ప్రయాణిస్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారు. ఈ బీచ్ రోడ్డు గుండానే అతి భారీ వాహనాలు సైతం ఫిషింగ్ హార్బర్‌కు వెళ్తుండడంతో వాహనదారులు మరింత ఇబ్బందులు గురవుతున్నారు. అటుపక్క పర్యాటకులు సముద్ర సోయగాలను వీక్షించేందుకు అనేకమంది నిత్యం వస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం కూడా కలుగుతోంది. రోడ్డు ధ్వంసమైనచోట సంబంధిత అధికారులు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయటం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ధ్వంసమైన బీచ్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.










