రాయచోటి : ఈ నెల 15న ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించబోయే ధర్నాను జయప్రదం చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉమ్మడి కడప జిల్లా కార్యదర్శి రవిశంకర్, ఉపాధ్యక్షులు రెడ్డయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్ ఫెక్ల్సీ వద్ద ధర్నా కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఖనిజ సంపదను, సహజ వనరులను, ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తెగనమ్ముతున్న పాలకులు తమను తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటున్నారున్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజాస్వామిక వాదులపై క్రూరమైన చట్టాలను మోపి సంవత్సరాల తరబడి జైల్లో నిర్బంధిస్తున్నారుని ఆరోపించారు. అన్యాయంగా అమాయకులను వేధిస్తూ వారి హక్కులకు భంగం కలిగిస్తున్నారున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకమైన భావజాలం కలిగిన కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లపై, ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రజాసంఘాల నాయకులపై ఉ.పా కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధిస్తున్నారని వాపోయారు. వారి తరఫున న్యాయపోరాటం చేస్తున్న లాయర్లను కూడా వదలడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుల నిర్మూలనాపోరాట సమితి, పౌరుహక్కుల సంఘం, చైతన్య మహిళా సంఘం, ప్రజా కళామండలి, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం, అమరుల బంధుమిత్రుల సంఘం, విరసం, ప్రగతిశీల కార్మిక సమాఖ్యకు చెందిన నాయకులపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారున్నారు. తెలంగాణలో దుర్మార్గమైన, అన్యాయమైన, వింతైన ఆరోపణలతో తెలంగాణలోని 'తాడ్వాయి' పోలీస్ స్టేషన్ పరిధిలో 152 మందిపై కేసు రిజిస్టర్ చేశారున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజ, పౌర హక్కుల సంఘం నాయకులు నారాయణరావు, గడ్డం లక్ష్మణ్‌తో పాటు జర్నలిస్టులు, కళాకారులు, రచయితలతో సహా ప్రతిపక్ష నాయకులపై కూడా కేసులు నమోదు చేసి తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ధర్నా చౌక్‌లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రవిశంకర్, చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.ఝాన్సీ లక్ష్మి, ఆదిరెడ్డి నాయక్, బి.సి.సంఘం నాయకులు ఆంజనేయులు, దళిత సంఘం నాయకులు బండపల్లి రవి, పామయ్య, నారాయణ పాల్గొన్నారు.










