ప్రజాశక్తి-అద్దంకి: ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అద్దంకి ఎంపీడీవో ఆఫీస్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు తంగిరాల వెంకటేశ్వర్లు కోరారు. మండలంలోని చక్రాయపాలెం ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన వేతనాలు గత ఆరువారాల నుంచి చెల్లించడం లేదని, ఈ కారణంగా కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. క్రమంగా కూలీలు ఈ పని మానుకొని వేరే ప్రాంతాలకు వలస పోతున్నారని అన్నారు. వలసలు నివారించడం కోసం ఏర్పాటు చేసిన ఈ ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయటం లేదని, అందుకనే సోమవారం జరిగే ధర్నాలో ఉపాధి కూలీలందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అద్దంకి మండల కార్యదర్శి మోండ్రు చిన్న సుబ్బారావు, కూలీలు పాల్గొన్నారు.










