Sep 25,2023 22:13

ఆందోళనలో ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : వివిధ ప్రజా సంఘాలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌ ముందు ఆందోళన చేపట్టాయి. సోమవారం స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు, ఎఆర్‌పిఎస్‌ నాయకులు, వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల ఆందోళనతో కలెక్టరేట్‌ దద్దరిల్లింది. ఉపాధ్యాయ సంఘాలు పాత పెన్షన్‌ విధానం అమలుపరచాలని డిమాండ్‌ చేస్తూ గణేష్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ కు ర్యాలీ నిర్వహించారు. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కలెక్టరేట్‌ వరకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఐదుగురిని మాత్రమే పోలీసులు అనుమతించగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలెక్టర్‌ కు వినతిపత్రం సమర్పించారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీతో కలెక్టరేట్‌ చేరుకున్నారు. పోలీసులు అడ్డగించినా కూడా వారిని చేదించుకొని ర్యాలీ ముందుకు వచ్చింది. అలాగే పలు మండలాల నుంచి వివిధ సమస్యలపై ప్రజలు కలెక్టరేట్‌ కు చేరుకున్నారు. కలెక్టరేట్‌ గేటు ముందు భారీగా పోలీసులు మోహరించి ఆందోళనకారులను అదుపు చేశారు.