Apr 11,2023 00:35

ప్లైవుడ్‌ కంపెనీ ముఠా కార్మికుల ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు నేత కోటి

ప్రజాశక్తి - అనకాపల్లి
జిల్లాలోని పలు సమస్యలపై సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.
ప్లైవుడ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని..
అనకాపల్లి : అచ్యుతాపురం మండలం ఎస్‌ఈజెడ్‌ పరిధిలో ఉన్న రుషిల్‌ డెకార్‌ ప్లైవుడ్‌ కంపెనీలో పనిచేస్తున్న ముఠా కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట సిఐటియు ఆధ్వర్యాన సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం ముఠా కార్మికులకు గత వారం రోజులుగా పనులు కల్పించకుండా రోడ్డున పడేసిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు కార్మికులకు పనులు కల్పించాల్సింది పోయి, ఉన్న పనులను తొలగించి కార్మికుల పొట్టకొట్టడం దుర్మార్గమన్నారు. రసూల్‌ యాజమాన్యం పాత పద్ధతిలోనే ముఠా కార్మికులకు కూలి రేట్లు చెల్లించి అందరిని పనిలోకి పెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం స్పందనలో జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రొంగలి రాము, గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు కూండ్రపు సోము నాయుడు, చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి అప్పారావు, నిర్వాసితుల సంఘం నాయకులు బుద్ధ రంగారావు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
వైజాగ్‌- చెన్నై కారిడార్‌ నిర్వాసితులకు ఒకే విధమైన నష్టపరిహారం చెల్లించాలని...
అనకాపల్లి : విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ నిర్వాసితులకు ఒకే విధమైన నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, అమలాపురం గ్రామ సర్పంచ్‌ శంకర్రావు డిమాండ్‌ చేశారు. నిర్వాసితులతో కలిసి కలెక్టరేట్‌ ముందు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టి, అనంతరం స్పందనలో జెసి కల్పనాకుమారికి వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి, కాగిత, వేంపాడు గ్రామాల్లో భూములు సేకరించి 150 అడుగుల రోడ్డు నిర్మించేందుకు ఏపీఐఐసీ ప్రయత్నిస్తోందని తెలిపారు. తమ గ్రామాలకు ఆనుకుని ఉన్న రాజయ్యపేట నుంచి దోనివానిలక్ష్మీపురం వరకు ఐదు రెవెన్యూ గ్రామాల్లో 5500 ఎకరాలు సేకరించి ఒకే విధమైన నష్టపరిహారం చెల్లించినట్లు చెప్పారు. కాని తమ మూడు గ్రామాలకు వేరువేరుగా నష్ట పరిహారం చెల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఒక ఆర్‌ కార్డు ఇచ్చి శాశ్వత ప్రాతిపదికన ఉపాధి ఇవ్వాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ భూ సేకరణ కొరకు నియమించబడిన ప్రత్యేక ఉప కలెక్టర్‌ రైతులను బెదిరించే ధోరణి విడనాడాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు భూముల్లోకి అధికారులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రావి చిన్ని, రోకలి శ్రీను, పెంటకోట నరసింగరావు, నాగనబోయిన ఈశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.
శంకరం గ్రామస్తుల ఆందోళన
అనకాపల్లి : అనకాపల్లి మండలం శంకరం గ్రామం సర్వేనెంబర్‌ 29, రేబాక సర్వేనెంబర్‌ 99లో నిర్ణీత సరిహద్దులు పోల్చకుండా ఉన్న ఉమ్మడి స్థలంలో ఇల్లు లేని 26 మంది శంకరం గ్రామస్తులకు ఎల్పీసీలు ప్రభుత్వం మంజూరు చేయగా, రెండవ వార్డు సభ్యులు కరణం భవాని భర్త శంకర్రావు కొంతమందితో కలిసి తనకు ఇళ్ల స్థలం ఇవ్వాలని, లేకుంటే తగిన పారితోషికం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నందున ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్‌ ముందు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. దీనిపై పలుమార్లు స్పందన కార్యక్రమంలో అర్జీలను ఇస్తామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జెసి కల్పనా కుమారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పసుపులేటి లక్ష్మి, గ్రామ వైసిపి నాయకులు పసుపులేటి రామకృష్ణ, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.