ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ నిరసనలు, ర్యాలీలను జగన్ ప్రభుత్వం నిషేధిస్తూ ఇచ్చిన జిఒ నెంబర్ ఒకటిని రాష్ట్ర హైకోర్టు కొట్టి వేసిన తర్వాత కూడా కాకినాడ జిల్లా కలెక్టరేట్ ముందు అనధికార నిషేధాన్ని కొనసాగిస్తున్నారని, తక్షణం కలక్టరేట్ వద్ద నిరసనలపై పోలీసుల నిర్బబందాన్ని ఎత్తివేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిఆర్‌ఒ కూరపాటి శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. శుక్రవారం కచేరిపేటలోని లక్ష్మీదాస్ భవన్‌లో అఖిలపక్ష నాయకులందరూ సమావేశమై కాకినాడలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజకీయాలకతీతంగా ఎజెండాలు పక్కనపెట్టి కలిసి పోరాడాలని నిర్ణయించారు. ఇటీవల ఎస్‌పి ఎస్.సతీష్ కుమార్‌ను కలిసి అఖిలపక్షం నాయకుల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలపై పోలీసుల దూకుడు వైఖరిని వివరించామని, అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ కలుగజేసుకొని ప్రజాసమస్యలపై రాజ్యాంగం కల్పించిన నిరసన తెలియజేసే హక్కుని కాపాడాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్ కృతికా శుక్లాను కలవాలని నిర్ణయించారు. ఈ అఖిలపక్ష సమావేశంలో సీనియర్ దళిత ఉద్యమ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ, సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజకుమార్, కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు జ్యోతి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కెఎస్.శ్రీనివాస్, ఈశ్వరరావు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఆదినారాయణ, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వరరావు, ఎఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గుడాల సత్యనారాయణ, టిఎన్‌టియుసి నాయకులు రాజారావు, ఐఎఫ్‌టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ పాల్గొన్నారు.










