ప్రజాశక్తి -తగరపువలస : స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాల సలహా బోర్డును ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యాన ఈ నెల 20న కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం స్థానికంగా పోస్టర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు ఆర్‌ఎస్‌ఎన్.మూర్తి మాట్లాడుతూ, ఆశ, అంగన్వాడీ, మిడ్డే మీల్స్, విఒఎ తదితర స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం రూ.26 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ సదుపాయం, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్ల న్యాయ బద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్ర తరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవ్వ నరసింగరావు, ఓళ్ళ నాగరాజు, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, విఒఎ సంఘాల నాయకులు లక్ష్మి, కనకదుర్గ, సన్యాసి పైడమ్మ, ఎస్.గున్నమ్మ, సన్యాసిరావు, ఎం.పద్మావతి, ఎస్.రమ్య, ఎస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










