ప్రజాశక్తి -ములగాడ : జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బుధవారం చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు మల్కాపురంజోన్ కమిటీ ఆధ్వర్యాన 59వ వార్డు పరిధి నెహ్రూనగర్ నుంచి హనుమాన్‌నగర్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కాలనీ, 60వ వార్డు ఎంఐజి కాలనీ, శ్రీహరిపురంలో జివిఎంసి కాంట్రాక్టు కార్మికులు మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మల్కాపురం జోన్ అధ్యక్షులు కె.పెంటారావు మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు చేపట్టే ధర్నాను జయప్రదంచేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు కార్మికులకు కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రైతులకు గిట్టుబాటు ధర, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వరంగ పరిశ్రమలు ప్రయివేటీకరణ ఆపాలని, అధికధరలు తగ్గించాలనే డిమాండ్లతో ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో కె.రమణ, బి.గొల్లబాబు, రాము, వెంకటేష్, జె.సురేష్, అప్పన్న సూరిబాబు, డి.పాప, శ్యామల, లలిత, రమణమ్మ, దుర్గ పాల్గొన్నారు.










