ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : ధర్మవరం పట్టుచీరల వ్యాపారులకు తాము అండగా ఉంటామని పట్టుచీరల తయారీ సంఘం పట్టణ అధ్యక్షులు గిర్రాజు రవి. పేర్కొన్నారు. స్థానిక శమీనారాయణస్వామి దేవాలయంలో సోమవారం పట్టుచీరల వ్యాపారులతో ఆ సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గిర్రాజు రవి మాట్లాడుతూ ఇప్పటికే విజయవాడలోని ఆలయశిల్క్ అధినేత అవినాశ్రుప్తా ధర్మవరం వ్యాపారులకు వేలకోట్ల రుపాయిలు బకాయి లున్నారన్నారు. గత కొన్ని రోజులుగా విజయవాడకు వెళ్లి అసోషియేషన్ తరపున పోరాటం చేసి రూ.5 కోట్లు రికవరీ చేశామన్నారు. ఇందులో కొంతమందికి 10శాతం వడ్డీతో కూడా బకాయిలను ఇప్పించామన్నారు. ధర్మవరంలో 18 మంది వ్యాపారులతో కలసి పట్టణంలో పోలీస్ స్టేషన్లో కేసుల ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో ధర్మవరం వ్యాపారులకు రూ.100కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని కూడా వసూలు చేస్తామని అన్నారు. ధర్మవరం వ్యాపారులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. ఈసందర్భంగా పట్టుచీరల తయారీ వ్యాపారుల సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షులుగా కలవలరాంకుమార్, పోలా వెంకటనారాయణ, ఉపాధ్యక్షులుగా నాగభూషణరెడ్డి, పోలా ప్రభాకర్, నీలూరి శ్రీనివాసులు, రంగంఆది, కార్యదర్శిగా దత్తశివ, కోశాధికారిగా మురళీధర్, సహకోశాధికారిగా హేమంత్ కుమార్‌తో పాటు 10మంది డైరెక్టర్లను ఎంపికచేశారు.










