ఒకవైపు వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మరోవైపు, సాధారణ ప్రజలు-కార్మికులు, రైతులు మార్కెట్ నుండి అధిక ధరలకు అదే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అధిక ధరల ద్వారా వసూలు చేసిన డబ్బు ఎక్కడికి పోతుంది? నిజమైన ఉత్పత్తిదారులకు, రైతులకు కాదు. కార్పొరేట్లు, పెద్ద భూస్వామ్య వర్గం ఆధిపత్యం చెలాయించే బడా వ్యాపారులకు, రుణదాతలకు చేరుతుంది. వీరే చిన్న రైతుల నుంచి చౌక ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వారే మార్కెట్‌ను, ఉత్పత్తులను నియంత్రిస్తారు.
మోడీ నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు లేకుండా విధించిన ఆకస్మిక లాక్‌డౌన్ ప్రజలపై అనేక రకాల కష్టాలను తెచ్చిపెట్టింది. లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. శ్రమజీవుల ఆదాయం బాగా తగ్గిపోయింది. మన దేశ సంపదను ఉత్పత్తి చేసే కోట్లాది మంది కార్మికులు ఆకలితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితమే ఇది.
ఆహారం, ఇంధనం, వస్తువుల అధిక ధరలు... సరఫరా వైపు అడ్డంకులు రిటైల్ మరియు టోకు స్థాయి ద్రవ్యోల్బణం రేటులో ప్రతిబింబిస్తాయి. బియ్యం, వంటనూనెలు, పప్పులు, కూరగాయలు, గుడ్లు తదితర నిత్యావసర ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. వంటనూనెల ధర 60 శాతం వరకు పెరుగుదలను చూసింది. రైతులు తమ పంపుసెట్లు, ట్రాక్టర్లకు వినియోగించే డీజిల్ ధర పెరగడంతో తీవ్రంగా నష్టపోతున్నారు.
సబ్సిడీలో భారీగా కోత విధించడంతో వంటగ్యాస్ ధర పెరిగింది. 2019-20లో వంట గ్యాస్‌కు మొత్తం ప్రత్యక్ష నగదు సబ్సిడీ రూ. 22,635 కోట్లు. ఇది ఇప్పుడు రూ. 3,559 కోట్లకు (ఫిబ్రవరి 2021 వరకు) తగ్గింది. దీంతో మొత్తం భారం వినియోగదారులపైనే పడింది.
పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలు మరియు ఇతర పన్నుల భారీ భారం ఈ ధరల పెరుగుదలపై ప్రధానంగా ఉంది. గత మూడేళ్లలో అంటే 2018 నుంచి మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఇంధన పన్నుల ద్వారా రూ.8 లక్షల కోట్లు ఆర్జించింది. 2020-21లో రూ. 3.71 లక్షల కోట్లు ఆర్జించింది. పైగా ఈ కాలంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఆదాయాలను కోల్పోయారు.
పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు, వివిధ ఇన్‌పుట్‌ల ధరల పెరుగుదల నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపుతాయి. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్‌పై రూ.33, లీటర్ డీజిల్‌పై రూ.32 వుంది. అనేక రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి కి ఎదురుదెబ్బలు తగిలిన తరువాత, ధరల పెరుగుదలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికాక, మోడీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ. 5, లీటర్ డీజిల్‌పై రూ. 10 కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని నామమాత్రంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇది కేవలం టోకెన్ తగ్గింపు మాత్రమే, ఇది ప్రజలకు పెద్దగా ఉపశమనం కలిగించదు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, టీకాల కార్యక్రమానికి డబ్బులు కావాలి కాబట్టి పెట్రోలు, డీజిల్‌పై పన్నులు తగ్గించలేమని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి చేసిన వాదన అవాస్తవం. ఇది అశాస్త్రీయమైనది కూడా. అనేక ఇతర పన్ను మినహాయింపులు, రాయితీలతో పాటు కార్పొరేట్ పన్నులను తగ్గించడం ద్వారా మోడీ ప్రభుత్వం రూ.1.45 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలను వెనక్కి తీసుకోవడం ద్వారా కలిగే ఆదాయ నష్టాన్ని... కార్పొరేట్ పన్ను రేటును 2019కి ముందు స్థాయికి పునరుద్ధరించడం ద్వారా తిరిగి పొందవచ్చు. అతి సంపన్నులపై సంపద పన్ను విధించడం ద్వారా తగినంత ఆదాయాన్ని పొందవచ్చు. కానీ మోడీ ప్రభుత్వం అలాంటిదేమీ చేయడానికి సుముఖత చూపడం లేదు. ఎందుకంటే అది స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్లకు అసంతృప్తి కలిగిస్తుంది. అందుకే ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా కోట్లాది మంది ప్రజలను బాధిస్తోంది.
ధరల పెరుగుదలపై నియంత్రణను అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం నిరాకరించింది. బదులుగా, నిత్యావసర వస్తువుల చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి చర్యలు తీసుకుంది. అధిక ధరలతో సామాన్యులు అల్లాడుతుంటే కార్పొరేట్లకు సూపర్ లాభాలు వచ్చేలా చేయడమే దీని ఉద్దేశం.
ఒకవైపు ప్రభుత్వం ధరల పెరుగుదలను సులభతరం చేసే విధానాలను అవలంబిస్తోంది. మరోవైపు, కోవిడ్ మహమ్మారి సమయంలో ఉద్యోగాలు, ఆదాయాలను కోల్పోయిన కార్మికులకు, ఇతర శ్రామికులకు ఎటువంటి ఉపశమనం అందించడానికి నిరాకరిస్తోంది. మహమ్మారి కాలంలో పేద వర్గాల కార్మికుల వాస్తవ ఆదాయాలు బాగా తగ్గాయి. దానివల్ల, మన దేశ సంపదను సృష్టించే కోట్లాది మంది కార్మికులు, శ్రమజీవులు నేడు ఆకలి, పేదరికం లోకి నెట్టబడ్డారు.
ప్రపంచ ఆకలి సూచీలో 2020లో 94వ స్థానంలో వున్న భారత్ 2021లో 101వ స్థానానికి పడిపోయింది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల కంటే దిగువన ఉంది. ఆకలి పెరిగిందంటే దేశంలో మనకు సరిపడా తిండి లేనందువల్ల కాదు. ప్రపంచ ఆకలి సూచీలో మన స్థానం పడిపోతున్నప్పుడు, దేశంలో అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారధాన్యాల నిల్వలు ఉన్నాయి. 1 సెప్టెంబర్ 2021న, ఎఫ్.సి.ఐ వద్ద 50.2 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల ధాన్యం ఉచిత పంపిణీ కోసం ఈ నిల్వలను విడుదల చేయడం వల్ల నిరుపేదల ఆహార అవసరాలు తీరుతాయి. ధరలు కూడా తగ్గుతాయి. అందుకుగాను 26.2 మిలియన్ టన్నులు అవసరం. ట్రేడ్ యూనియన్ ఉద్యమం, ప్రముఖ ఆర్థికవేత్తల సిఫార్సుల్లో స్థిరమైన ఈ డిమాండ్ ఉన్నప్పటికీ, బిజెపి ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. బదులుగా, ఇథనాల్ ఉత్పత్తి కోసం ధాన్యాలు, చెరకును ఉపయోగించేందుకు పథకం వేసింది !
ఒకవైపు వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మరోవైపు, సాధారణ ప్రజలు-కార్మికులు, రైతులు మార్కెట్ నుండి అధిక ధరలకు అదే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అధిక ధరల ద్వారా వసూలు చేసిన డబ్బు ఎక్కడికి పోతుంది? నిజమైన ఉత్పత్తిదారులకు, రైతులకు కాదు. కార్పొరేట్లు, పెద్ద భూస్వామ్య వర్గం ఆధిపత్యం చెలాయించే బడా వ్యాపారులకు, రుణదాతలకు చేరుతుంది. వీరే చిన్న రైతుల నుంచి చౌక ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వారే మార్కెట్‌ను, ఉత్పత్తులను నియంత్రిస్తారు. స్పెక్యులేటివ్-ఫ్యూచర్ ట్రేడింగ్‌లో మునిగిపోతారు. ఇది ధరల పెరుగుదలకు మరొక ప్రధాన అంశం.
ధరల పెరుగుదల ద్వారా ప్రజలపై మోయలేని భారాలు మోపడాన్ని మనం ఇక సహించలేం. రోజువారీ నిత్యావసరాల ధరలు వాటంతటవే పెరగవు. సామాన్య ప్రజల ఖర్చుతో బడా వ్యాపార-పెద్ద భూస్వామ్య తరగతి లాభాల ఆకలిని తీర్చడానికి ప్రభుత్వమే పూనుకుంటోంది. ఇది నేటి పాలకుల నిజ స్వరూపం.
ధరలు తగ్గించాలని, ప్రజలకు ఉపశమనం కల్పించాలని సిఐటియు, ఇతర కేంద్ర కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి. కాబట్టి...
ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేద్దాం.
- ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ను సార్వత్రీకరించాలి. పిడిఎస్ కింద 14 నిత్యావసర వస్తువులను అందించాలి.
- ఆహార ధాన్యాల స్పెక్యులేటివ్-ఫ్యూచర్ ట్రేడింగ్‌పై నిషేధం విధించాలి.
- పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలి.
- విద్య, ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. ప్రభుత్వ సంస్థల ద్వారా పేదలందరికీ ఉచిత విద్య, ఆరోగ్య సేవలు అందించాలి.
- ఆదాయ పన్ను చెల్లించని కుటుంబాలకు నెలకు రూ. 7500 అందివ్వాలి. ఆహార, ఆరోగ్య సంబంధిత సహాయాన్ని అందించాలి.
నయా ఉదారవాద ఎజెండాకు కట్టుబడి...మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెట్టడాన్ని కార్మిక వర్గం అనుమతించదు. శ్రమజీవులు ఉమ్మడి పోరు ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పైడిమాండ్లను సాకారం చేసుకోగలరు. రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను ఎత్తివేయాలంటూ బిజెపి ప్రభుత్వం మెడలు వంచిన చారిత్రాత్మక రైతు పోరాట విజయం నుండి మనం నేర్చుకునే పాఠం ఇది.
/ ఫీచర్స్ అండ్ పాలిటిక్స్ /










