ప్రజాశక్తి-సత్తెనపల్లి : విద్యుత్ ఛార్జీలు, నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తహశీల్దార్ సురేష్‌కు వినతి పత్రం అందజేశారు. విమల మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, పేద, మధ్యతరగతి ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్యాస్ సిలిండర్ రూ.450 నుండి రూ.1200కు పెంచారని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో అనివార్యంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని అన్నారు. తాను అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఇప్పటికి ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు ప్రజలకు భారంగా పరిణమించాయని, అయినా ఆ విధానాలనే రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం 13, 14 వార్డు సచివాలయంలో వినతి పత్రం అందజేశారు. నాయకులు ఎ.వీరబ్రహ్మం, కె.శివదుర్గారావు, ఎం.జగన్నాథరావు, జె.రాజకుమార్, ఎ.వెంకట్ నారాయణ, పి.సూర్యప్రకాశరావు, హనుమంతరావు, పి.మహేష్, ఆర్.పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.










