మోడీ నాయకత్వంలో బిజెపి అధికారంలోకి (2014లో) రావటానికి అనేక రకాల వాగ్దానాలు చేసింది. వాటిలో ముఖ్యమైనది పెరుగుతున్న ధరలను అదుపులో పెడతామనటం. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. 2019లో మోడీ ప్రభుత్వం రెండవసారి వచ్చాక కూడా నిత్యావసరాల ధరలు అదుపు లేకుండా పెరిగిపోసాగాయి.
పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపే కొంప ముంచింది
మోడీ ప్రభుత్వం కరోనాకు ముందు 2019లో కార్పొరేట్ కంపెనీ యజమానులైన సంపన్నులు కట్టే కార్పొరేట్ ఆదాయ పన్నును 8 శాతం తగ్గించి రూ. లక్షన్నర కోట్ల రాయితీ ఇచ్చింది. ఆ తరువాత సంవత్సరాల్లో లాభాలు పెరిగిన కారణంగా ఆ రాయితీ మరింతగా పెరిగి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టగా ప్రభుత్వ ఆదాయానికి మాత్రం నష్టం కలిగించింది. కరోనా వచ్చిన తరువాతైనా ఇతర దేశాల మాదిరిగా ప్రజల ఆరోగ్య రక్షణకు అవసరమైన నిధుల కోసం సంపన్నులకు ఇచ్చిన రాయితీని ఎత్తివేయలేదు. తనకు అవసరమైన ఖర్చుల కోసం ప్రజల మీద భారాలు వేసింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్స్తైజ్ పన్నును దశల వారీగా పెంచుకుంటూ పోయింది. 2014 లో లీటరు పెట్రోల్ మీద ఎక్స్తైజ్ పన్ను రూ. 9.48 ఉండగా... 2021 జులైలో రూ. 32.90 లకు (3 రెట్లు పైన), అదే కాలంలో డీజిల్ మీద రూ. 3.56 నుండి రూ. 31.80కు (9 రెట్లు) పెరిగింది. ఇదే సమయంలో ముడి చమురు ధర సగానికి సగం తగ్గింది. 2022 మే 21న పెట్రోల్ మీద రూ.8.00, డీజిల్ మీద రూ.6 తగ్గించడం కంటి తుడుపు చర్య మాత్రమే. ఇంతకు ముందు ఒకసారి, ఇప్పుడు ఒకసారి తగ్గించిన తరువాత కూడా 2014తో పోల్చినప్పుడు పెట్రోలు మీద రూ. 27.90 (మూడు రెట్లు), డీజిల్ మీద రూ. 19.90 (ఐదున్నర రెట్లు) వసూలు చేస్తోంది. అదే సమయంలో సరాసరిన 2014-15లో ముడి చమురు రేటు ఎంత వుందో, 2021-22 ఆర్థిక సంవత్సరంలో కూడా అదే స్థాయిలో వుంది. ప్రజలను నిట్టనిలువున దోచుకోటం స్పష్టంగా కనపడుతోంది. డీజిల్ దోపిడి వలన రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. వంట గ్యాస్ 2014 లో రూ. 400కు పైబడి ఉన్నది. ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటింది. దీపం పథకం కింద ఉన్న వారికి మాత్రం రూ.200 తగ్గిస్తారట. రాబోయే ఎన్నికల్లో ఈ కంటి తుడుపు చర్యలు మోడీ ప్రభుత్వాన్ని కాపాడలేవు.
రోజువారీ సరుకుల ధరలు పైపైకి
మోడీ 8 సంవత్సరాల పాలన ప్రజలకు కడగండ్లు మిగిల్చింది. గత 8 సంవత్సరాలలో...చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2022 ఏప్రిల్‌లో అత్యధికంగా...7.8 శాతానికి పెరిగింది. ఆకాశాన్ని అంటుతున్న ధరలను దించుతానన్న మోడీ, అన్ని వాగ్దానాలకు మాదిరిగానే దీనికీ తూట్లు పొడిచారు. సరళీకరణ విధానాల అమలులో భాగంగా నిత్యావసర సరుకుల చట్టం అమలుకు పాలకులు చెల్లుచీటి ఇస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలలో ఒకటైన నిత్యావసర సరుకుల చట్టాన్ని మార్చి మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అత్యవసర పరిస్థితులలో మినహా సరుకుల నిల్వలకు, ధరలకు ఉన్న నియంత్రణలను ఎత్తివేసింది. రైతుల పోరాటం వలన ఆ చట్టం రద్దయినప్పటికీ, ఆ చట్టం కలిగించిన దుష్ప్రభావం కొనసాగుతోంది. మోడీ ప్రభుత్వం మరియు నల్ల వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఓటు వేసిన వైసిపి ప్రభుత్వాలు ధరల కట్టడికి సరయిన చర్యలు తీసుకోటంలేదు. బడా వ్యాపారులకు, సంపన్నులకు అనుకూలమైన విధానాలను కొనసాగిస్తున్నాయి.
రాష్ట్ర వైసిపి ప్రభుత్వం తన వంతుగా కార్మికులు, ప్రజలపై భారాలు మోపుతోంది. 2022 ఏప్రిల్ 1 నుండి విద్యుత్ చార్జీలను యూనిట్‌కు 45 పైసల నుండి రూ.1.57 పైసల వరకు పెంచి సంవత్సరానికి రూ.1400 కోట్ల భారం వేసింది. వెనువెంటనే అదే నెలలో డీజిల్ సెస్ పేరుతో పల్లె వెలుగు బస్సులలో రూ.2.00, ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో రూ.5.00, ఎ.సి బస్సులలో రూ.10.00 చొప్పున అదనంగా పెంచింది. వీటికి తోడు ప్రతి సంవత్సరం 15 శాతం చొప్పున ఇంటి పన్ను పెంచింది. దీని వలన కార్మికులకు అద్దెల భారం కూడా పెరుగుతుంది. మోడీ ప్రభుత్వ ఆదేశానుసారం చెత్తపన్ను వసూలు చేస్తోంది. ఇవన్నీ కూడా ప్రజలకు భారం అవుతున్నాయి. కార్మికుల నిజ వేతనాల తరుగుదలకు దారి తీస్తున్నాయి.
వినిమయ సరుకుల ధరల ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 7.8 శాతం పెరిగింది. దీనిలో భాగంగా వుండే వంట నూనెల ద్రవోల్బణం 17.28 శాతం, కూరగాయల ద్రవ్యోల్బణం 15.41 శాతం పెరిగింది. 2019 ఏప్రిల్ నెలతో పోల్చినప్పుడు 2022 ఏప్రిల్ నెలలో ధరలు ఎంత భారీగా పెరిగాయో పట్టికను చూస్తే తెలుస్తుంది.
ధరలు ఇంత భారీ స్థాయిలో పెరుగుతున్నప్పుడు కొద్దిపాటి వేతనాలతో బతికే కార్మికుల జీవితాలు దుర్భరమవుతాయి. ప్రత్యేకించి ధరల పెరుగుదలకు కొంతమేర నష్టపరిహారంగా వచ్చే డిఏ కూడా లేని వారికి నిజ వేతనాలు వేగంగా కోతకు గురవుతాయి. డి.ఎ వచ్చే వారికి కూడా ధరలు పెరిగినంత స్థాయిలో డి.ఎ రాదు. వారి నిజ వేతనాలు కూడా కోతకు గురికాక తప్పదు. అందుకే ప్రతి నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి తమ వేతనాల పెరుగుదల కోసం కార్మికులు పోరాడతారు. పోరాడకపోతే తమకు వచ్చే వేతనాల విలువ తీవ్రంగా పడిపోతుంది.
కార్మికులు తమకు వచ్చే వేతనాలతో రోజువారీ వాడకపు సరుకులు, బట్టలు, ఇంటి అద్దెలు, కరెంటు, రవాణా ఖర్చులు, ఆరోగ్యాలు, పిల్లల చదువులు, వినోదం, పండగలు, పబ్బాలకు ఖర్చుపెడతారు. వీటి రేట్లు, ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతుంటాయి. ఈ పెరుగుదలకు తగ్గట్లుగా వేతనాలు పెరగాలి. వీటన్నిటినీ విడివిడిగా లెక్కేసుకోకపోయినా, ఉదాహరణకు 4 సంవత్సరాల కిందట వచ్చే వేతనాలతో మొద్దు లెక్క కోసం 100 కిలోల సరుకు వస్తుందనుకుంటే, అదే వేతనంతో నాలుగు సంవత్సరాల తరువాత కూడా అంత సరుకు రాదు. 70 కిలోలో, 80 కిలోలో వస్తుంది. వేతనంతో కొనుక్కుంటే వచ్చే దానినే నిజ వేతనం అంటారు. ఇది నిరంతరం తగ్గిపోతుంది.
ధరల పెరుగుదల అసంఘటిత కార్మికుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. 2021 మార్చి నెలతో పోల్చుకుంటే కార్మికుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. 2021 మార్చి నెలతో పోల్చుకుంటే 2022 మార్చిలో 6.95 శాతం ధరలు (ద్రవ్యోల్బణం) పెరిగాయి. 2021 ఏప్రిల్ నెలతో పోల్చినప్పుడు 2022 ఏప్రిల్ నెలలో ధరలు 7.79 శాతం (ద్రవ్యోల్బణం) పెరిగాయి. అంటే మార్చిలో తగ్గినట్లు, ఏప్రిల్‌లో పెరిగినట్లు కాదు. ఒక సరుకు ధర ఒక సంవత్సరంలో రూ. 100 వుండేది...మరో సంవత్సరం అదే సమయానికి రూ. 107 అయితే 7 శాతం పెరిగినట్లు. రూ. 107 నుండి ఆపై వచ్చే సంవత్సరంలో రూ. 113.42 పైసలకు పెరిగితే సరుకు ధర 6 శాతం మాత్రమే పెరిగినట్లు అవుతుంది. అయితే ధర తగ్గలేదు. రూ. 107 నుండి రూ. 113.42కు పెరిగింది. ద్రవ్యోల్బణం తగ్గించామని పాలకులు చెప్పుకోవటంలో ఈ మోసం ఉంది.
ధరల పెరుగుదల శ్రమ జీవులందరి సమస్య. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు శంఖం పూరించాయి. అందరం ఇందులో భాగస్వాములవుదాం. బడా వ్యాపారులు, సంపన్నుల బొక్కసాలు నింపే పాలకుల విధానాలను ఓడిద్దాం.


వ్యాసకర్త : సిఐటియు రాష్ట్రఉపాధ్యక్షులు పి. అజయకుమార్










