Aug 23,2023 18:32

30 నుంచి దశలవారీ ఆందోళనకు పిలుపు - సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
ప్రజాశక్తి - భీమవరం
ధరలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఇప్పటికైనా ధరలను అరికట్టాలని లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం ప్రభుత్వాలను హెచ్చరించారు. బుధవారం సిపిఎం పట్టణ కమిటీ, ముఖ్యుల సమావేశం పట్టణ నాయకులు ఎం.వైకుంఠరావు అధ్యక్షతన సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. వీటితోపాటు విద్యుత్‌ సంస్కరణల ద్వారా కరెంట్‌ ఛార్జీలు పెంచారని విమర్శించారు. పెద్దపెద్ద కార్పొరేట్‌ శక్తులకు రుణాలు మాఫీ చేస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై జిఎస్‌టి పేరుతో లక్షల కోట్ల రూపాయలు భారాలు వేస్తున్నారని విమర్శించారు. ఉపాధి లేక పెరిగిన ధరలు తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఉపాధి చూపించి అధిక ధరలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 30వ తేదీ నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకూ అధిక ధరలు, నిరుద్యోగంపై దశల వారీ ఆందోళనకు సిపిఎం పిలుపునిచ్చిందని తెలిపారు. సచివాలయం, తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట జరిగే ధర్నాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలపాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు, నాయకులు డి.నాగేశ్వరరావు, కె.కృష్ణ, చైతన్‌ ప్రసాద్‌, బి.త్రిమూర్తులు, బంగారు వరలక్ష్మి , నీలాపు అప్పన్న పాల్గొన్నారు.