May 03,2023 00:20

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : దిగుబడి తగ్గి, ధరల్లేక, బీమా సదుపాయం అందక జిల్లాలో పసుపు రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లుగా ప్రతి ఏడాదీ సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2018-19లో 12,057 ఎకరాలు, 2019-20లో 11,277 ఎకరాల్లో సాగు చేయగా 2020-21లో 10,645 ఎకరాల్లో సాగు చేశారు. 2021-22లో 8,166 ఎకరాల్లో, 2022-23లో కొత్త జిల్లాలో కేవలం 3864 ఎకరాల్లోనే సాగు చేశారు.
ఎకరాకు రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారు. 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావిస్తే కేవలం 25 క్వింటాళ్లే వచ్చింది. ధర రూ.5వేలు మించకపోవడం వల్ల ఆదాయం రూ.1.25 లక్షలు దాటలేదు. దీంతో పెట్టుబడి కూడా దక్కలేదు. ప్రస్తుతం క్వింటాళ్‌ కనిష్ట ధర రూ.4,500 నుంచి ఉండగా గరిష్ట ధర రూ. 5వేల వరకు ఉంది. కనీస మద్దతు ధర రూ.6850గా ప్రభుత్వం గతేడాది ప్రకటించింది. కనీసం రూ.8 వేలకు కొనుగోలు చేస్తేగాని గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది క్వింటాళ్‌ రూ.ఐదువేలకు మించి కొనడం లేదు.
ఖరీఫ్‌లో పసుపు సాగు చేసిన సమయంలో మాండూస్‌ తుపాను, అధిక వర్షాల వల్ల దుంపకుళువచ్చి ఎకరాకు 25 శాతం వరకు దిగుబడి తగ్గింది. మరోవైపు కనీసం 5 వేల ఎకరాలు సాగు ఉంటేనే బీమా వస్తుందని లేదంటే బీమా రాదని అధికారులు చెబుతున్నారు. జిల్లా పరిధిలో 3864 ఎకరాల్లోనే సాగు కావడం వల్ల బీమా వర్తింపు చేయడం లేదు.
జిల్లాల పునర్విభజన పసుపు రైతులకు శాపంగా మారింది. ఉమ్మడి జిల్లా ఉంటే కనీసం 10 వేల ఎకరాల్లో సాగయ్యేది. దీంతో అప్పట్లో బీమా సదుపాయం వచ్చేది. జిల్లాల పునర్విభజన వల్ల కొత్తగా ఏర్పడిన గుంటూరు జిల్లాలో కేవలం 3864 ఎకరాల్లోనే సాగు చేశారు. అయినా రైతుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని పసుపు పంటకు బీమావర్తింప చేయాలని ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినా ఇంత వరకు సానుకూల స్పందన రాలేదు. పసుపు పంటకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి బీమా వర్తింప చేయాలని రైతులు కోరుతున్నారు.
ధరలు పడిపోయినా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయడంలేదు. ధరల స్థిరీకరణ నిధి ఉపయోగించడం లేదు. దుగ్గిరాల యార్డులో ఇతర ప్రాంతాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో దుగ్గిరాల వస్తున్నారు. వీరి వద్ద కూడా క్వింటాళ్‌ పసుపు గరిష్టంగా రూ.5వేలకు మించి వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. గతేడాది గరిష్ట ధర రూ.6 వేల వరకు వచ్చింది. ఉమ్మడి జిల్లాలో విస్తీర్ణం సమస్య లేకపోవడం వల్ల గతేడాది ఎకరాకు రూ.58 వేల వరకు బీమా సదుపాయం దక్కింది. ఈ ఏడాది జిల్లాల విభజన వల్ల విస్తీర్ణం సమస్య ఏర్పడి బీమా సదుపాయం అందలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన మార్పుల వల్ల డిమాండ్‌ తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు.