Sep 19,2023 19:37

సమావేశంలో మాట్లాడుతున్న ప్రభాకర్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఆదోని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, ధరలు, విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సన్నద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కె.ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆదోనిలోని మెట్రో ఫంక్షన్‌ హాలులో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వెంకటేశులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువులు, వంటగ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచారని విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు మాట ఇచ్చి ఉన్న ఉద్యోగాలను తొలగించే పనుల్లో మోడీ నిమగమయ్యారని మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏ దేశంలో పెరగనంతగా భారతదేశంలో పెరిగాయని తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నప్పటికీ, అదే స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాల్సింది ఉందని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకే విధంగా పెరుగుతున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కును కార్పొరేట్‌ శక్తులకు అమ్మేందుకు మోడీ సిద్ధమయ్యారని తెలిపారు. ఉక్కు పరిశ్రమను నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఒక్క మాటైనా మాట్లాడలేని విమర్శించారు. మోడీని వ్యతిరేకిస్తే అప్పులకు అనుమతి ఇవ్వడేమోననే భయం, పాత కేసులు తిరగదోడి జైలుకు పంపుతారని భయంతో కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. నరేంద్ర మోడీకి ఈ దేశాన్ని పరిపాలించే అర్హత లేదని, 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఇంటికి సాగనంపుతారని హెచ్చరించారు. ఈనెల 22న ఆదోనిలో ప్రారంభం కానున్న రాష్ట్ర బస్సు జాతాను జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌ దేశాయి, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్‌.రాధాకృష్ణ, బి.రామాంజినేయులు, జిల్లా నాయకులు ఎమ్‌డి.అంజిబాబు, సి.గురు శేఖర్‌, సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మన్న, లింగన్న, సీనియర్‌ నాయకులు ఈరన్న, మహానంది రెడ్డి, కౌతాళం, ఎమ్మిగనూరు, దేవనకొండ, ఆస్పరి, ఆలూరు, కోసిగి, మంత్రాలయం, తుగ్గలి మండల కార్యదర్శులు ఈరన్న, వీరశేఖర్‌, హనుమంతు, షాకీర్‌, రాముడు, జయరాజు, మల్లయ్య పాల్గొన్నారు.