Aug 27,2023 23:19

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మోహనరావు

పలాస : పెరుగుతున్న ధరలు అదుపు చేయాలని, విద్యుత్‌ ఛార్జీల భారాలను తగ్గించాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 4 వరకు సిపిఎం ఆధ్వర్యాన సమర భేరి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి సమర భేరి పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజు రోజుకీ నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయని, దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలు సరుకులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి రాక ముందు గ్యాస్‌ రూ.450 ఉంటే... ఇప్పుడు రూ.1200కు పెరిగిందని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అదుపు లేకుండా పెరుగుతున్నాయన్నారు. ధరలను అదుపు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపారులకు కొమ్ముకాస్తుందే తప్ప ధరలు తగ్గించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ నిధులు తగ్గించేస్తూ... ఈ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తుందని విమర్శించారు. పరిశ్రమలు మూత వల్ల కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్‌.గణపతి, కె.భాగ్యలక్ష్మి, ఎస్‌.ఢిల్లేశ్వరి పాల్గొన్నారు.