ప్రజాశక్తి-కలెక్టరేట్ : మార్కెట్‌లో నిత్యావసర సరుకులు బియ్యం, కంది పప్పు, మినప పప్పు ధరల నియంత్రణకు వ్యాపారులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు కోరారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైస్‌మిల్లర్ల అసోసియేషన్, కేటర్ డీలర్స్‌తో ధరల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 15 తేదీ నుంచి నిర్దేశించిన ధరలు ప్రకారం దుకాణాలలో సరుకులు విక్రయించాలని ఆదేశించారు. దుకాణాల వద్ద ధరల పట్టికను వినియోగ దారులకు కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మార్కెట్లో బియ్యం, కంది పప్పు, మినప పప్పు ధరలు పెరుగుదలకు కారణాలు, ఇబ్బందులను చర్చించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి ఆర్. శివప్రసాద్, డిఎం దేవుల నాయక్, మార్కెటింగ్ సహాయ సంచాలకులు ఎల్.అశోక్ కుమార్, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గర్భాపు ఉదరు భాను, భోగి గోపాలకృష్ణ, సిఎస్ డిటిలు, తదితరులు పాల్గొన్నారు.










