
ప్రజాశక్తి - తణుకు రూరల్
రోజుకోరకంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, కరెంట్ ఛార్జీలతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వాటిని అదుపుచేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం విమర్శించారు. గురువారం స్థానిక అమర వీరుల భవనంలో పార్టీ పట్టణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ... ఎన్నికల ముందు 'నేను ఉన్నాను, నేను విన్నాను' అని చెప్పిన మాటలకు అనుగుణంగా నేడు పాలన లేదన్నారు. నిత్యావసర ధరలు ఆకాశనంటుతున్నా ప్రభుత్వం ధరల నియంత్రణ చేపట్టకపోవడం శోచనీయమన్నారు. కరెంట్ ఛార్జీలు గతంలో ఎన్నడూ లేనివిధంగా రకరకాల పేర్లుతో వాడిన దానిమీద డబుల్ వేస్తున్నారన్నారు. రైతులు నీరందక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, స్వామినాధన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆక్వా సాగు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. జగనన్న ఇంటి నిర్మాణాలు జిల్లాలో ఆలస్యంగా జరగ డానికి కారణం ప్రభుత్వం ఇచ్చే సాయం సరిపోవడం లేదని, రూ.ఆరు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడ్కో గృహాల లబ్ధిదారులకు నిర్మాణాలు పూర్తి చేసి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు చాలా పరిశ్రమల్లో చట్టాలను అమలు చేయడం లేదని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పివి.ప్రతాప్, కామన మునిస్వామి, గార రంగారావు, అడ్డగర్ల అజయ కుమారి, గుబ్బల గోపి, మూర్తి పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : పెంచిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ పట్టణ సభ్యుల జనరల్ బాడీ సమావేశం గురువారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జవ్వాది శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ జిల్లాలో, తాడేపల్లిగూడెంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. చాలా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులకు, ప్రభుత్వాలకు పట్టడం లేదని, వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచిందని, ఆ భారాలను ప్రజలు మోయలేకపోతున్నారని తెలిపారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలకు కొనుగోలు శక్తి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరెంట్ బిల్లులు చూస్తే షాక్ కొడుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన బిల్లులకు సర్‌ఛార్జీలు వేసి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో నన్నయ్య యూనివర్సిటీలో మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టాలని, వెంకట్రామన్న గూడెంలో గేదెల పరిశోధనా కేంద్రాన్ని అభివృద్ధి చేసి రైతాంగానికి ఉపయోగపడేలా చేయాలని కోరారు. నిట్ యూనివర్సిటీలో రెండో దశ పనులు ప్రారంభించి అభివృద్ధి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. ధరలను తగ్గించాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళన, ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాలకు తగు బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కరెడ్ల రామకృష్ణ, సిద్దిరెడ్డి శేషుబాబు, వర్రి అప్పారావు, మడకా రాజు, దనాల వెంకట్రావు పాల్గొన్నారు.