
ప్రజాశక్తి - ఉండి
రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్ విమర్శించారు. మండలంలోని చెరుకువాడ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ బిజెపి ప్రభుత్వం సామాన్యునికి చేస్తున్న మోసాలను వివరించారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రూ.430 ఉండే గ్యాస్ సిలిండర్ ధర మూడింతలు పెరిగి సామాన్యుని నెత్తిన గుదిబండగా మారిందని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు రెండింతలు పెరిగి సామాన్యుల జీవన విధానం కష్టతరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సెప్టెంబర్ నాలుగో తేదీ వరకూ వివిధ దశల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రచారం నిర్వహిస్తూ, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్, నాయకులు చీర్ల శేషు, నిమ్మితి కిషోర్, రుద్రరాజు విజయరామరాజు, చీర్ల శ్రీనివాస్, ఎం.పెద్దింట్లు, పి.నాగేశ్వరరావు, రాము పాల్గొన్నారు.