ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ధరలను అదుపు చేయడంలో, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని సిపిఎం నగర కార్యదర్శి పి.కిషోర్ విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం చేపట్టిన సమరభేరిని మంగళవారం ఉదయం తంగెళ్లమూడి ప్రాంతంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిత్యావసర సరుకుల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు. నిరుద్యోగులను పకోడీలు వేసుకుని బతకండంటూ బిజెపి నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగించిందని విమర్శించారు. మన రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి పార్లమెంట్లో మద్దతు పలుకుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.ఆదిశేషు, వి.సాయిబాబు, బి.జగన్నాధరావు, ఎస్.సత్యనారాయణ, ఎం.ఇస్సాక్, ఏసుబాబు, మీసాల సత్యం, పైడియ్య, షేక్ కరీముల్లా, షేక్ సైదాని పాల్గొన్నారు.
కలిదిండి: మూలలంక, పెదలంక గ్రామాల్లో సిపిఎం నాయకులు కరపత్రాలు పంపిణీ చేస్తూ, అధిక ధరలు తగ్గించాలని కోరుతూ సంతకాల సేకరణ నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి శేషపు మహంకాళిరావు, నాయకులు కుడిపూడి శ్రీనివాసరావు, ఎస్‌ఎన్‌వి.సత్యనారాయణ, జక్కుల మహేష్, జోగి ఏసు, గద్దె అనిల్ కుమార్, చీకటి సత్యనారాయణ పాల్గొన్నారు.










