Sep 08,2023 20:23

పొలంలో మినుము పంటను కోత కోస్తున్న మిషన్‌

ధర ఉన్నా.. దిగుబడి లేదు..
- తగ్గిన మినుము దిగుబడులు
- ఎకరాకు 5 క్వింటాళ్లే..
- ఎర్రగుడిలో నకిలీ విత్తనాలతో పూర్తిగా నష్టపోయిన రైతులు
ప్రజాశక్తి - రుద్రవరం

      ఖరీఫ్‌ సీజన్లో రైతులు సాగుచేసిన మినుము పంట వాతావరణ మార్పుల కారణంగా దిగుబడులు తగ్గిపోయాయి. ఈ ఏడాది గిట్టుబాటు ధర బాగున్నా దిగుబడి లేదని మినుము రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుద్రవరం మండలంలోని పేరూరు, ఎర్రగుడిదిన్నె, బి నాగిరెడ్డి పల్లె, చందలూరు, చిలకలూరు, మందలూరు, తదితర గ్రామాల్లో దాదాపు 1200 ఎకరాలకు పైగా రైతులు మినుము పంటను సాగు చేశారు. ఎర్రగుడిదిన్నె గ్రామంలో 400 ఎకరాల్లో సాగు చేసిన మినుము పంట నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన గ్రామాల్లో ప్రస్తుతం రైతులు మినుము పంట కోత కోస్తున్నారు. ఎకరానికి గత ఏడాది 8 క్వింటాళ్ల దాకా దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది ఎకరానికి 5 క్వింటాళ్లు మాత్రమే దిగుబడులు వస్తున్నట్లు రైతులు తెలిపారు. ప్రస్తుతం 1 క్వింటా మినుము పంటను రూ. 9 వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి పెట్టుబడి రూ.15 వేల దాకా ఖర్చు అవుతుందని, దాదాపు రూ.30 వేల దాకా మిగులుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ధర బాగున్నా నకిలీ విత్తనాలు, వర్షాలు సక్రమంగా కురవకపోవడం, తెగుళ్లు, వైరస్‌ కారణంగా దిగుబడులు తగ్గిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడులు అంతంత మాత్రమే ఉన్నాయి
- రైతు సుబ్బరాయుడు, ఎర్రగుడిదిన్నె గ్రామం.
ఈ ఏడాది సాగు చేసిన మినుము పంట దిగుబడులు అంతంత మాత్రమే ఉన్నాయి. వర్షాలు సరిగా పడలేదు. తెగుళ్లు ఎక్కువగా ఉన్నాయి. పంట దిగుబడి తగ్గిపోయింది. గిట్టుబాటు ధర ఉంది. కొద్దిగా నకిలీ విత్తనాలు కూడా కలవడంతో పంట సరిగా రాలేదు.