Mar 26,2023 23:50

దేవరాపల్లి వారపుసంతకు అమ్మకానికి తెచ్చిన చింతపండు

ప్రజాశక్తి- దేవరాపల్లి : దేవరాపల్లిలో ఆదివారం నిర్వహించే వారపు సంతలో చింతపండుకు ధర లేక రైతులు దిగాలు పడ్డారు. ఈ సీజన్లో చింతపండు దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ, చింతపండుకు గిట్టుబాటు ధర రాకపోవడం పట్ల చింత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు ముందు కిలో చింతపండు రూ.60 నుంచి రూ.65కు విక్రయించగా, ఇపుడు రూ.40 కూడా పలకడం లేదని రైతులు వాపోతున్నారు. దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, సిండికేట్‌గా మారి, చింతపండుకు ధర లేకుండా చేస్తున్నారని, దళారుతే తక్కువ ధరకు కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజ్‌లకు పంపిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. దళారుల వల్లే చింతపండుకు గిట్టుబాటు లభించడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టడం ద్వారా గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని చింత రైతులు కోరుతున్నారు.