
చాపాడు గత ఖరీఫ్, రబీ సీజన్‌లో సాగు చేసిన వరి ధాన్యం ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు రోజు రోజుకూ పెరుగుతూ పుట్టి ( 8బస్తాలు) రూ. 25వేలకు చేరుకున్నాయి. దిగుబడి మాత్రం ఆశించన స్థాయిలో లేకపోవడంతో మరో వైపు రైతులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్‌లో వరి నూర్పిడి పనులు చేపట్టిన సమయంలో పుట్టి(8 బస్తాల) ధర రూ. 12 వేల వరకు పలికాయి. ఆ తర్వాత జనవరి లో రూ.13 వేలకు ధరలు చేరుకున్నాయి. జూన్‌లో రూ.21వేలు పలికి తగ్గుముఖం పట్టాయి. తిరిగి ధరలు పెరిగి ప్రస్తుతం రూ. 24,500 పలుకుతున్నాయి. ప్రస్తుతం నూర్పిడి చేసే ఈ ఖరీఫ్ సీజన్ లో సాగైన వరి ధాన్యం రూ. 16 వేలు పలుకుతున్నాయి.
గ్గిన వరి సాగు...
ఉమ్మడి కడప జిల్లాలో సాధారణంగా కెసి, కుందూ, బ్రహ్మసాగర్, మైలవరం, గండికోట, పలు చెరువుల కింద వరి పంటను అత్యధికంగా సాగు చేపట్టేవారు. దాదాపు మూడు లక్షల ఎకరాల్లో రైతులు రబీ, ఖరీఫ్ సీజన్‌లలో వరిపంటను సాగు చేసేవారు. దాదాపు లక్ష మంది కౌలురైతులు వరిసాగుపై ఆధారపడి ఉన్నారు. వేలాది మంది వ్యవసాయ కార్మికులు వరిసాగులో పెద్దఎత్తున ఉపాధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా వరుసగా మూడు సంవత్సరాలు వరిసాగులో నష్టాలు తప్ప, తప్పలాభాలు అనేవి లేకుండా పోయాయి. దీనికి ప్రధానకారణం సరైన మద్దతు ధరలేకపోవడమే. ఎకరా వరి సాగుకు రూ.35 నుంచి రూ. 40వేల వరకు సాగు ఖర్చులు అవుతున్నాయి. పుట్టి వరి ధాన్యం ధర నూర్పిడి సమయంలో రూ. పది వేల లోపు మాత్రమే ఉన్నాయి. 40 బస్తాల దిగుబడి వచ్చినా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు గత ఏడాది వరి సాగును తగ్గించారు. దీంతో క్రమంగా సాగు తగ్గుముఖం పట్టింది. గత ఖరీఫ్‌లో సాగైన వరి ధాన్యం ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది వరి సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో ప్రధాన నీటి వనరైన కెసికి నీరు విడుదల కాకపోవడంతో సాగు గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 80వేల ఎకరాల వరకు సాగు తగ్గింది. దీంతో ఇతర ఆరుతడి పంటల సాగుకు మెగ్గు చూపుతున్నారు. చాపాడు మండల పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా 16 వేల ఎకరాల్లో సాగు అయ్యేది. అలాంటిది ఈ ఏడాది 3400 ఎకరాలకు పరిమితమైంది.
దిగుబడి తగ్గుముఖం...
గత ఏడాది కంటే ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి పంట నిరాశజనకంగా ఉండటంతో దిగుబడి తగ్గే పరిస్థితి నెలకొంది. గత ఖరీఫ్ సీజన్‌లో ఎకరాకు 32 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ఎకరాకు రూ. 30 వేల వరకు సాగు ఖర్చులు అయ్యాయని రైతులు పేర్కొన్నారు. దిగుబడి పెరగడం, ధరలు ఆశాజనకంగా ఉండడంతో సాగు ఖర్చులు పోను రైతులకు ఆదాయం చేకూరింది. ప్రస్తుతం నూర్పిడి చేసే వరి పంట దిగుబడి ఆశాజనకంగా ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. 2012లో అధిక వర్షాలకు, వరద తాకిడికి వరి పంట అధికంగా దెబ్బతింది. వర్షానికి పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.6వేలు నష్టపరిహారం మంజూరైంది. గత ఏడాది ఖరీఫ్ లో సాగు చేసిన లో వరి ధాన్యం ధర రూ. 24 వేలకు పైగా ధర పలుకుతున్నాయి. దీంతో వరి ధాన్యాన్ని నిల్వ ఉంచిన రైతులు అమ్మకాలకు సిద్ధపడుతున్నారు.
వరి ధాన్యానికి సరైన
గిట్టుబాటు ధర..
వరి ధాన్యానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర అందుబాటులో ఉంది. జనవరిలో రూ. 12వేలు ఉన్న పుట్టి ధర ప్రస్తుతం క్రమేపీ పెరిగి రూ.24 వేలకు పైగా పలుకుతున్నాయి. గతంలో రూ. 17వేలకు మించేవి కావు. ధరలు పెరుగుతుండడంతో నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని అమ్మకాలు చేపడుతున్నాం.
- ఓబుళరెడ్డి, రైతు, పాతపాలెం, మైదుకూరు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు..
వరి ధాన్యానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ధర వచ్చింది. పాత వరి ధాన్యంతో పాటు వేసవిలో సాగు చేసిన వరి ధాన్యం ధరలు కూడా రూ. 24 వేలకు పైగా పలుకుతున్నాయి. గతంలో వరుసగా అధిక వర్షానికి దెబ్బతిన్నడం, సాగు తక్కువ కావడం, ఇతర ప్రాంతాలకు ఎగుమతికి అనుమతి వంటి కారణాలతో ధరలు పెరిగినట్లు తెలుస్తుంది.
- సుబ్బరాయుడు ,వరి ధాన్యం వ్యాపారి, చాపాడు.