Apr 16,2023 23:58

పెసర పంటను ఆరబెట్టుకుంటున్న రైతు

ప్రజాశక్తి - దుగ్గిరాల : సాగు ప్రారంభంలో ధరలను ఊరించిన దళారులు, వ్యాపారులు అనంతరం పంట చేతికి వచ్చిన తర్వాత రైతులను ఉసూరు మనిపిస్తున్నారు. పెసర మార్కెట్‌ ఒడిదుడుకులతో రైతులు తీవ్ర ఆందోళన, గందరగోళానికీ గురవుతున్నారు.
దుగ్గిరాల మండలంలోని ఎక్కువగా రెండో పంటగా మినుము, మొక్కజొన్న సాగవగా పెనుమూలిలోని పడమర ప్రాంతంలో మాత్రం నీటి సదుపాయం కొరత కారణంగా పెసర ఎక్కువగా సాగైంది. ఈ గ్రామం పరిధిలో సుమారు 3 వేల ఎకరాల సాగు భూమి ఉండగా ఇందులో దాదాపు 500 ఎకరాల్లో ఈ ఏడాది మినుము సాగైంది. రెండు వారాల కిందట పంట నూర్పిళ్లు ప్రారంభమైన తొలిరోజుల్లో క్వింటాళ్‌ పెసర ధర రూ.7,300 ఉండగా అనంతరం అనేక హెచ్చుతగ్గులకు గురవుతోంది. నూర్పిళ్లు మొదలైన వారానికే ధర రూ.6,700కు పడిపోయింది. ఒకదశలో రూ.6,300 వరకూ తగ్గింది. అయితే క్రమంగా మళ్లీ పెరుగుతూ గత శనివారం రూ.6,900కు, ఆదివారం రూ.7,200కు చేరింది.
ధరలో ఎగుడుదిగుడులను గమనిస్తున్న రైతులు తమ పంటను అమ్ముకోవాలో లేదో అర్థంకాక సతమతమవుతున్నారు. దీనికితోడు ఎక్కువ మంది రైతులకు నిల్వ సదుపాయాలు లేని కారణంగా ఎప్పటికప్పుడు ఉన్న ధరకే తెగనమ్ముకోవాల్సి వస్తోంది. పంట నిల్వ చేస్తే తరుగుదల వస్తుందనే ఆందోళన ఇందుకు మరోకారణం.
ఎకరా పెసర సాగుకు రూ.10 వేల వరకూ ఖర్చవుతుంది. విత్తనాల కొనుగోలు, తెగుళ్ల బారి నుండి పైరును కాపాడుకోవడానికి మందులు వేయడమే పెసర సాగులో ప్రధాన ఖర్చు. నీటి తడులు ఎక్కువగా అవసరం ఉంది. ఒకటి రెండుసార్లు అందిస్తే సరిపోతుంది. సాధారణంగా వర్షమే ఆధారంగా ఈ పంటను రైతులు సాగుచేస్తుంటారు. అయితే ఈ ఏడాది సరైన వానల్లేక పంట దిగుబడులు తగ్గాయి. సాధారణంగా ఎకరాకు ఐదారు క్వింటాళ్ల వరకూ దిగుబడి ఉంటుంది. అయితే ప్రస్తుతం సగటున మూడున్నర క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. రెండో పంటపై ఆశలు పెట్టుకుని సాగులోకి దిగిన రైతులు ఇప్పుడు దిగుబడి తగ్గడంతో నిరాశకు గురయ్యారు. మరోవైపు ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియక కంగారు పడుతున్నారు.