గిరిజనుల సమస్యలు, అటవీ ఉత్పత్తులకు మద్దతు ధరలు, ఫారెస్ట్ అధికార్ల దాడుల నుండి గిరిజనుల రక్షణ, మావోయిస్టులకు సానుకూలంగా ఉన్నారని గిరిజనులపై పోలీసుల దాడుల నుండి రక్షణకు చేసిన పోరాటాలు, ఉద్యమాలు శ్రీరామమూర్తి చేసిన కషి అనితర సాధ్యం. గిరిజన ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం.. ఒకటేమిటి సమస్త ఉద్యోగులు ఉద్యమాల్లో శ్రీరామమూర్తి లేకుండా జరగలేదని చెప్పొచ్చు. సవర విద్యావాలంటీర్ల సమస్యపై జరిగిన పోరాటంలో శ్రీరామమూర్తి పాత్ర కీలకం. గిరిజన ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, అటవీ భూమికి పట్టాలు అన్నింటా శ్రీరామమూర్తిదే ప్రధాన పాత్ర.
కామ్రేడ్ రెడ్డి శ్రీరామమూర్తి కరోనాకు బలయ్యారు. ఆయన మరణంతో పార్టీని, ప్రజలను పెను విషాదం ఆవహించింది. 33 ఏళ్లు కలిసి పని చేసిన నేను తీవ్రమైన మానసిక వ్యథకు గురయ్యాను. అతని మరణం... కుటుంబానికే గాక పార్వతీపురం డివిజన్ ప్రజలకు తీరని నష్టం చేసింది. పార్టీకి,ప్రజాతంత్ర ఉద్యమానికి పెను విషాదం మిగిల్చింది.
కామ్రేడ్ రెడ్డి శ్రీరామమూర్తి అందరి మనిషి
అర్ధరాత్రి, అపరాత్రి కూడా లేకుండా.. ఎవరు ఎక్కడ నుండి ఫోను చేసి అనారోగ్యంగా ఉంది ఆసుపత్రికి రమ్మంటే వెళ్ళేవారు. ఏ సమయంలోనైనా ప్రజలకు అవసరమైతే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళేవారు. ఏ ఆఫీసులో ఎవలరికీ ఏ పని ఉన్నా ఆ పని జరిగేంతవరకు వదిలి పెట్టేవారుకాదు. ఒక మనిషి పనైనా పదిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగేవారు.
శ్రీరామమూర్తి నోటి నుండి కాదు, లేదు అనే మాటే వినలేదు
గత 30 ఏళ్లలో ఏ పని చెప్పినా లేదు, కాదని శ్రీరామమూర్తి నోటి నుండి వినలేదు. అన్ని కార్యక్రమాలకు ఎటువంటి లోటు లేకుండా చూసేవారు. ముఖ్యంగా 30 ఏళ్లలో ఏనాడూ డబ్బులేదని అనలేదు. డబ్బు లేదని కరపత్రం వేయకపోవడం గానీ, పోస్టర్ ప్రింట్ చేయకపోవడం గానీ జరగలేదు. డబ్బు అవసరమని రూపాయి కూడా ఏనాడూ అడగలేదు. ఉద్యమానికి అవసరమైన నిధిని ప్రజల నుండి ఆయనే బాధ్యతగా వసూళ్లు చేసేవారు.
శ్రీరామమూర్తితో సీతానగరం ఉద్యమం
1985 నుండి యార్క్ అనే యువజన సంఘం ద్వారా గ్రామ గ్రామాన యువజన సంఘాల నిర్మాణంలో పని చేయడం మొదలైంది అతని సంఘ జీవితం. 1987 నాటికి డివైఎఫ్‌ఐ జెండాను అందుకున్నారు. మొదట సీతానగరం మండలంలో కుగ్రామమైన రెడ్డివానివలసలో యువతనంతా ఒకటి చేశారు. మండలానికి, జిల్లాకి యువజనోద్యమం విస్తరణకు ఎంతో కషి చేశారు. బొబ్బిలి కేంద్రంగా నడిచిన ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలిచారు. యువజన సంఘం నాయకుడిగా బొబ్బిలి తారకరామా కాలనీలో ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై స్థానిక ఎమ్మెల్యేను ఎదిరించి న్యాయం సాధించారు. అదే పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీలో పేదలకు జరిగిన అన్యాయంపై పార్లమెంటు సభ్యుడిపైనే పోరాడి విజయం సాధించారు. తొలి నుండి సమస్య పరిష్కారమయ్యేంత వరకూ పోరాడిన ఉత్తమ లక్షణం శ్రీరామమూర్తికి ఉంది.
పార్వతీపురంలో పార్టీ పునర్నిర్మాణం
శ్రీరామమూర్తి అతివేగంగా కమ్యూనిస్టు సిద్ధాంతంపై సిపిఎం రాజకీయ అవగాహన పెంచుకొని 1989 నుండే ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధమై సిపిఎం పూర్తికాలం కార్యకర్తగా నిర్ణయం తీసుకున్నారు. నాటి నుండి నిన్న కనుమూసేంత వరకు మరో ఆలోచనే లేకుండా జీవితాన్ని పార్టీకి, ప్రజా ఉద్యమాలకే అంకితం చేశారు. 1990లో శ్రీదేవితో ఆదర్శ వివాహం అనంతరం పార్వతీపురం కేంద్రంగా పని చేయడం మొదలెట్టారు. తొలుత తన ఇల్లే పార్టీ ఆఫీసుగా ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నారు.
అప్పటికే ప్రారంభమైన ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నిర్మాణంతోపాటు, శ్రీరామమూర్తి వెళ్లిన తరువాత లారీ వర్కస్ యూనియన్, షాప్ ఎంప్లాయీస్ యూనియన్, రైస్ మిల్లు వర్కర్స్ యూనియన్స్‌ను నిర్మించారు. వారి కోసం పోరాటం నడిపి వారి మన్నన పొందారు. పార్వతీపురం ప్రాజెక్టులో అంగన్వాడీ యూనియన్‌ను నిర్మించడంలో జిల్లాలో అన్ని విధాలా అగ్రభాగాన నిలబెట్టారు. తరువాత రైతు, వ్యవసాయకార్మిక, మహిళ, గిరిజన, కులవివక్ష పోరాట సంఘాలను నిర్మించారు. మరికొన్ని వత్తి సంఘాలను నిర్మించారు. పార్వతీపురం పట్టణంలో రోడ్డు వెడల్పు సందర్భంలో పట్టణ వర్తకులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకొనే వారి పక్షాన నిలవడం, పేదలకు ఇళ్ల స్థలాలు ఆక్రమణ అన్నింటా శ్రీరామమూర్తి ముందు నిలిచారు. పార్వతీపురంలో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకూ, జర్నలిస్టులకు ఒకటేమిటి ఆపాలగోపాలానికి శ్రీరామమూర్తి ఆప్త మిత్రుడు. వారి అన్ని కార్యక్రమాల్లో అతను భాగస్వామే.
బొడికొండ, బడిదేవరకొండ, సిఖపరువు, తామరకొండ గ్రానైట్ త్రవ్వకాలు, రావివలస మెట్ట త్రవ్వకాలు, రావివాలస కో - ఆపరేటివ్ సొసైటీ బినామీ అప్పులు, గొట్టివలస భూములు అదీ ఇదీ అని లేదు. ప్రజల సమస్య ఏదైనా తనదే.
గిరిజనోద్యమం పునర్నిర్మాణంలో...
1970ల్లో గిరిజనోద్యమం విచ్ఛిన్నం అయిన తరువాత పునర్నిర్మాణంలో శ్రీరామమూర్తి పాత్ర కీలకం. ఇతర కామ్రేడ్స్ సహకారంతో శ్రీరామమూర్తి చేసిన కషి అనన్య సామాన్యం. గిరిజనుల సమస్యలు, అటవీ ఉత్పత్తులకు మద్దతు ధరలు, ఫారెస్ట్ అధికార్ల దాడుల నుండి గిరిజనుల రక్షణ, మావోయిస్టులకు సానుకూలంగా ఉన్నారని గిరిజనులపై పోలీసుల దాడుల నుండి రక్షణకు చేసిన పోరాటాలు, ఉద్యమాలు శ్రీరామమూర్తి చేసిన కషి అనితర సాధ్యం. గిరిజన ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం.. ఒకటేమిటి సమస్త ఉద్యోగులు ఉద్యమాల్లో శ్రీరామమూర్తి లేకుండా జరగలేదని చెప్పొచ్చు. సవర విద్యావాలంటీర్ల సమస్యపై జరిగిన పోరాటంలో శ్రీరామమూర్తి పాత్ర కీలకం. గిరిజన ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, అటవీ భూమికి పట్టాలు అన్నింటా శ్రీరామమూర్తిదే ప్రధాన పాత్ర. గిరిజన ప్రాంతంలో సర్వేలో పాల్గొని ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకోవడమే కాక వాటి పరిష్కారం కోసం ఉద్యమించారు. గిరిజన విద్యార్థులకు ఇంటర్లో హాస్టల్స్ కోసం పోరాటం జరిపించి జిల్లాలో 11 హాస్టల్స్ పెట్టించడంలో కూడా ఆయనిదే ముఖ్య పాత్ర.
తోటపల్లి నిర్వాసితుల పోరాటంలో...
శ్రీరామమూర్తి నిరంతర కషి, పట్టుదల లేకుండా తోటపల్లి పోరాటం, ఉద్యమం ఊహించడం కష్టం. 2003 నుండి నేటి వరకు తోటపల్లి ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నారు. మొదట ప్రాజెక్ట్ వద్దని అడ్డుకున్న ప్రజలు తరువాత జరగబోయే నష్టాన్ని అర్థం చేసుకోలేదు. పార్టీకి కనీసం సానుభూతిపరుడు కూడా లేని తోటపల్లి నిర్వాసిత గ్రామాల్లో రెండు సంవత్సరాలు ఇతర కార్యకర్తలతో కలిసి తిరిగి తిరిగి చివరికి ప్రజలను చైతన్యపరచి వేలాది మందితో మెట్టుపాక వద్ద 2005 ఏప్రిల్ 16న సమరశీల పోరాటం నిర్వహించడంలో శ్రీరామమూర్తిది ముఖ్యమైన భూమిక. ఆ పోరాటంలో శ్రీరామమూర్తి విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఆ కేసుల్లో 10 ఏళ్లు కోర్టుకు తిరిగారు. దాదాపు 50 పైన ఉన్న అనేక తోటపల్లి కేసుల్లో లీగల్ కృషికి అవసరమైన అన్ని రకాల తోడ్పాటునందించి పరిష్కారం అయ్యేవరకూ కృషి చేశారు.
చెరుకు రైతుల ఉద్యమంలో...
చెరుకు రైతుల సమస్యలపై యువజన సంఘంలో ఉండగానే ప్రారంభించారు. చెరుకు వుండగానే ఫ్యాక్టరీ గానుగ నిలిపివేయడంతో నాటి రాష్ట్ర యువజన నేత మధుని రప్పించి పోరాడి గానుగ కొనసాగించడంతో ఆ కృషి మొదలైంది. ప్రభుత్వ షుగర్స్ ఫ్యాక్తరీని ప్రైవేటుపరం చేయొద్దని పోరాడి జైలుపాలయ్యారు. ప్రైవేట్ షుగర్స్ యాజమాన్యం రైతులకు బిల్లులు చెల్లించకపోవడం, రైతుల పేరున కోట్ల రూపాయలు బినామీ అప్పులు చేసి చెల్లించకపోవడంపై వేలాదిమంది రైతులను కదిలించి రోడ్లన్నీ దిగ్బంధం చేసి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని జైలుకు పంపించి, రైతుల డబ్బు కక్కించిన ఉద్యమం శ్రీరామమూర్తి లేకుండా సాధ్యమయ్యేది కాదు. చెరుకు రైతుల పక్షాన నిలిచి జీవితమంతా నిలిచి పోరాడిన యోధుడు.
సామాజిక న్యాయం కోసం...
దళితుల పట్ల వివక్షను రూపుమాపాలని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సీరియస్‌గా అమలు జరిపారు. ఎన్నో పోరాటాలు జరిగాయి. అందులో శివ్వాం గ్రామం రామాలయంలో దళితుల ప్రవేశం ముఖ్యమైనది. ఆ గ్రామంలో టిడిపి, కాంగ్రెస్ రెండు పార్టీలు, ఎమ్మెల్యే, ఆధిపత్య సామాజిక తరగతుల ప్రజలు ఒక్కటైనా ధైర్యంగా దళితుల పక్షాన పార్టీ నిలిచి పోరాడి విజయం సాధించడంలో శ్రీరామమూర్తి పాత్ర కీలకమైనది. ఆ ప్రాంతంలో దళితులపై, గిరిజనులపై, గిజబ రజకులపై జరిగిన అన్ని దాడులపై న్యాయం కోసం పోరాడిన ధీరుడు శ్రీరామమూర్తి.
పార్టీ నిర్మాణంలో...
శ్రీరామమూర్తి పార్వతీపురం వెళ్లేనాటికి అక్కడ పార్టీ లేదు. ప్రజాసంఘాల నిర్మాణంతో పాటు పార్టీ నిర్మాణాన్ని చేపట్టారు. సిద్ధాంత రాజకీయ తరగతులు నిర్వహించి ఒక్కొక్కరిని పార్టీలోకి కూడగట్టారు. డివిజన్ అంతా పార్టీ విస్తరణకు కషి చేశారు. తన గ్రామం నుండి తన కుటుంబం నుండి పిన తండ్రుల కొడుకులను పార్టీలోకి, పూర్తికాలం కార్యకర్తలుగా ప్రోత్సహించి పార్టీని బలోపేతం చేసి ఆదర్శంగా నిలిచారు. రెడ్డివాని వలస చిన్న గ్రామమైనా ప్రతి సమస్యలపై స్పందించి మండలంలోనే కాదు జిల్లాలోనూ గౌరవం సంపాదించిందంటే శ్రీరామమూర్తి పాత్రే కీలకం. కార్యకర్తలతో చనువుగా, చొరవగా, హాస్యంగా మెలిగి, వారిలో కలిసిపోయే స్వభావం శ్రీరామమూర్తిది. కార్యకర్తలకు కష్టాల్లో అండగా నిలిచారు. తోటపల్లి నిర్వాసితుల సహకారంతో సుందరయ్య భవనం నిర్మించారు. అతని భార్య శ్రీదేవి సహకారం అతని పనికి గొప్ప బలాన్ని ఇచ్చింది. వారి ఇల్లే ఉద్యమ కేంద్రం అయింది.
త్యాగ జీవి....ధన్య జీవి - అతని దారిలో నడుద్దాం
శ్రీరామమూర్తి త్యాగ జీవి. ధీరోదాత్తుడు. భయమన్నది తెలియదు. ఈ 33 ఏళ్ల అతని పార్టీ జీవితంలో తనకంటూ ఉపయోగించుకున్న రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదు. అతి తక్కువ అలవెన్సుకు తన తాతతండ్రులు ఇచ్చిన ఆస్తిని కరగబెట్టి కుటుంబాన్ని నడిపి ఉద్యమాన్ని నిర్మించిన ఉత్తమ కమ్యూనిస్టు. పదవీవ్యామోహం, కీర్తి కండూతి వంటి అవలక్షణాలు లేశమాత్రం కానరావు. విసుగు, విరామం, అసహనం, పెత్తనం వంటి లక్షణాలు ఒక్క రోజూ వ్యక్తం కాలేదు.
మరో రెండు దశాబ్దాలపాటు.. ప్రజల కోసం పని చేయగలిగే ఆరోగ్యం గల కామ్రేడ్ రెడ్డి శ్రీరామమూర్తిని కరోనా కబళించేసింది. కొడుకు పెళ్లి సంతోషంలోనే ఈ ఘోరం జరిగిపోయింది. పిల్లలు స్థిరపడక ముందే శ్రీరామమూర్తి మరణం వలన కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. ఈ కష్టకాలంలో పార్టీ యావత్తూ మరింత పట్టుదలతో పార్టీని నిలబెట్టుకుని, బలపెట్టుకొని ముందుకు సాగాలి. అదే శ్రీరామమూర్తికి నిజమైన నివాళి. వారు వదిలి వెళ్లిన కర్తవ్యాన్ని పరిపూర్తి చేస్తామని శపథం చెద్దాం. పార్టీ వారి కుటుంబానికి అండగా నిలబెడుతుంది.
ఎం.కష్ణ మూర్తి











