ప్రజాశక్తి -పొదలకూరు : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఘోరాలు, నేరాలు అన్నీ.. ఇన్నీ కావని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. పొదలకూరు పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గహంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టాక అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేశారని దుయ్యబట్టారు. ఆది నుంచి చంద్రబాబు నాయుడి ఆస్తిపాస్తులు, చంద్రబాబు కుటుంబ నేపథ్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే అన్నారు. చంద్రబాబు అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి ధనార్జనే ధ్యేయంగా పని చేసి వేల కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. చంద్రబాబు గురించి చెప్పాలంటే మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని ,తానే స్థాపకుడుగా వ్యవస్థాపకుడిగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన 371 కోట్ల రూపాయల కుంభకోణం లో చంద్రబాబు పాత్ర నిర్ధారించిన తర్వాతే సిఐడి అరెస్టు చేసిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు పాత్ర పై జిఎస్టి, ఇంటెలిజెన్స్, సిఐడి, ఇన్కమ్ టాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసి, దీనిలో గోల్మాల్ జరిగిందని, చంద్రబాబు పాత్ర ఉందని తేట తెల్లం చేసిన తర్వాతే అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. పొదలకూరు సర్పంచ్ మల్లిక చిట్టెమ్మ, జడ్పిటిసి తెనాలి నిర్మలమ్మ, వైయస్సార్ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సోమా అరుణ,కోణం చిన్న బ్రహ్మయ్య, లక్ష్మీ కళ్యాణి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి, ఎం. శేఖర్, సోమా భాస్కర్, ఎస్కే అంజాద్, బి. భారతమ్మ, వేణుగోపాల్ రెడ్డి, శివశంకర్ ఉన్నారు.










