ప్రజాశక్తి- విఆర్.పురం
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సిపిఎం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ధర్నాకు విఆర్.పురం మండలం నుండి నిర్వాసితులు శుక్రవారం బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక రేఖపల్లి సెంటర్‌లో ఎంపిపి కారం లక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని, నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాకపోతే అందరిని ఐక్యం చేసి పోరాటాలు ఉధృతంగా చేస్తామని, నిర్వాసితుల కోసం ఎక్కడికైన వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, ఎంపిటిసి పూనెం ప్రదీప్ కుమార్, సర్పంచ్ కారం బుచ్చమ్మ, మండల నాయకులు పంకు సత్తిబాబు, కారం సుందరయ్య, శిరపు తాతబాబు, పులి మురళి, నిర్వాసితులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.










