
న్యూడిల్లీ : ఢిల్లీలో 'హత్యాచారానికి' గురైన తొమిదేళ్ల బాలిక కుటుంబ సభ్యులను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బుధవారం పరామర్శించారు. పాత నంగల్ ప్రాంతంలో నివసిస్తున్న 9 ఏళ్ల దళిత బాలికపై... ఆమె సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టి... ఆపై హత్య చేసి... విద్యుదాఘాతంతో చనిపోయిందని చెప్పి... హడావుడిగా దహన సంస్కారాలు నిర్వహించిన సంగతి విదితమే. ఈ ఘటనపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు, పౌర సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నారు. చిన్నారికి న్యాయం జరగాలని, నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో నిరసనకారులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ దారుణ ఘటనపై మంగళవారం రాహుల్ ట్విట్టర్‌లో స్పందిస్తూ 'ఈమె కూడా జాతి కుమార్తె' (ఒలంపిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులను జాతి బిడ్డలుగా ప్రధాని పేర్కొనడాన్ని ఉద్దేశించి) అని అభివర్ణించారు.
ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్...9 ఏళ్ల బాలికకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. ఈ ఘటన సిగ్గు చేటని, నగరంలో లా అండ్ ఆర్డర్‌ను బలోపేతం చేయాల్సిన అవసరముందని, నిందితులకు వీలైనంత త్వరగా ఉరిశిక్ష వేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. కాగా దళిత నేత, బీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బాధితురాలి తల్లిదండ్రులను కలిసి..పరామర్శించారు. అదేవిధంగా ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ విచారణను ప్రారంభించింది. నగర పోలీసులకు సమన్లు జారీ చేసింది.