Jul 02,2023 20:47

అధిక వర్షాలతో నీట మునిగిన పత్తి పంట (ఫైల్‌)

ప్రజాశక్తి - కౌతాళం
జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో నల్లరేగడి భూములు కలిగిన మండలం కౌతాళం. రైతులు ప్రధానంగా పత్తి పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే, దిగుబడులు తగ్గినా పంట బీమా ద్వారా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి ఎకరాకు పంట బీమా ద్వారా వచ్చిన సొమ్ము నేరుగా రైతుల ఖాతాలో జమ చేసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చర్యలు తీసుకున్నారు. అధికారుల తప్పిదాలు రైతులకు శాపంగా మారాయి.
వ్యవసాయ అధికారుల నివేదికల ప్రకారం కౌతాళం మండలంలో 47,422 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. ఇన్ని వేల ఎకరాల్లో పంట సాగయితే కేవలం 958 ఎకరాలకు మాత్రమే పంట బీమా మంజూరయింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కేవలం 293 ఎకరాలకు గాను 199 మంది రైతులకు రూ.2.90 లక్షలు మంజూరయింది. దిగుబడి రాక కేవలం 958 ఎకరాలకు 1,457 మంది రైతులకు రూ.1.32 కోట్లు మంజూరయింది. చాలామంది రైతులకు పంట బీమా రాకపోవడంతో విలవిల్లాడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద పంట బీమా జాబితాలో పేర్లు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో కేవలం ఒకరిద్దరికే పంట బీమా మంజూరు కావడంతో గ్రామ రైతులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు పెట్టుబడులు పెట్టి రైతులు సాగు చేశారు. అతివృష్టి, అనావృష్టి వల్ల, నాసిరకం విత్తనాల వల్ల దిగుబడులు రాక రైతులు పూర్తిగా నష్టపోయారు. ఎకరాకు కేవలం 1, 2 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి రావడంతో రైతులు అప్పుల పాలయ్యారు. ఇలా నష్టపోయిన రైతులు ప్రభుత్వం పంట బీమా మంజూరు చేస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. వ్యవసాయ అధికారులు విడుదల చేసిన పంట బీమా జాబితాను చూసి రైతులు నిరాశకు గురయ్యారు. పంట బీమా మంజూరు కావడంలో తప్పిదాలు ఎక్కడ జరిగాయో విచారణ చేసి రైతులకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. రైతులందరికీ పంట బీమా అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పత్తి రైతులను ఆదుకోవాలి
- మల్లయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు

మండలంలో పంట బీమా అందని పత్తి రైతులను వెంటనే ఆదుకోవాలి. వేలమంది రైతులు పత్తి పంట సాగు చేస్తే కేవలం కొద్దిమందికే పంట బీమా వచ్చింది. పంట బీమా రాకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. రైతులందరికీ న్యాయం జరగకపోతే రైతుల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం.