Jan 29,2023 23:20

  • కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత వెంకటరమణ

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: జీవితంలో దేనికి భయకుండా ధైర్యంగా ముందుకెళ్లి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత చొక్కాపు వెంకటరమణ విద్యార్థులకు పిలుపునిచ్చారు. అమరావతి బాలోత్సవం (ఐదో పిల్లల పండుగ) సందర్భంగా ఆదివారం కొత్తపేట కెబిఎన్‌ కళాశాల మీటింగ్‌ హాల్లో ముఖ్య అతిధులతో ఏర్పాటు చేసిన సెమినార్లు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. కెబిఎన్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వంగల నారాయణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో తొలుత 'విద్యార్థులు - సాంస్కృతిక వికాసం' అనే అంశంపై వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులకు జీవితంలో ఆటలు పాటలు కూడా భాగంగా కావాలన్నారు. విద్యార్థులు విద్యతో పాటు కళలు సాహిత్యం, ఆర్ట్స్‌ డ్రాయింగ్‌ వంటి అంశాలపై పట్టు సాధించాలని వీటి ద్వారా విద్యార్థులకు మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు ఒత్తిడి జయించవచ్చని తెలిపారు. పోటీ ప్రపంచంలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల ద్వారా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువైందని ప్రతిఒక్కరూ కూడా కళలు, సాహిత్యం, యోగా ద్వారా ఒత్తిడిని జయించి తమ కలలను నిజం చేసుకోవాలని అన్నారు. కళారూపాలను సిలబస్‌లో పెట్టి పాఠ్యాంశాలుగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు. స్మార్ట్‌ఫోన్లలో మంచి, చెడు రెండూ ఉన్నాయని, మంచిని మాత్రమే వినియోగించుకోవాలని కోరారు. మాతృభాష ప్రాముఖ్యతను, చదువు యొక్క ఆవశ్యకతను ఆయన కథ రూపంలో ఆసక్తిగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పారు.
అందరికీ విద్య అందుబాటులో ఉండాలి :లక్ష్మణరావు
కుల మతాలకు అతీతంగా అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమవతు పాత్ర పోషించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. బాలోత్సవంలో భాగంగా 'నేటి విద్యా వ్యవస్థ - శాస్త్రీయ ఆలోచన అనే అంశంపై లక్ష్మణరావు ప్రసంగిస్తూ నేటి సమాజంలో విద్య సామాన్యులకు అందని ద్రాక్షగా ఉందన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన అనేక మంది పేద పిల్లలు ఉన్నత విద్యకు దూరంగా ఉన్నారన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పారిశ్రామిక వాడల్లో చైల్డ్‌ లేబర్‌గా పనిచేస్తూ అనేకమంది విద్యకు నోచుకోవడం లేదన్నారు మధ్యతరగతి ప్రజలుకూడా తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించలేకపోతున్నారనీ కారణం 1990వ దశకం తర్వాత ఆర్థిక సంస్కరణలో మార్పుల వల్ల ప్రభుత్వాలు ప్రవేట్‌ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల కొన్ని విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ చదువు అందాలని చెప్పిన అంశం నేటికీ అమలు జరగడంలేదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వాలే ఉన్నత విద్యను ప్రతి ఒక్కరికి ఉచితంగా అందజేయాలని తెలియజేశారు. అందరూ విద్యను అభ్యసించటం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ అధ్యక్షులు ఎస్‌.పి.రామరాజు, ఆఫీస్‌ బేరర్స్‌ పి.మురళీకృష్ణ, జి.జ్యోత్స్న, శాతవాహన కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్‌ సాంబిరెడ్డి పాల్గొన్నారు.